క్రీడలు

CSK vs SRH: ఓడితే ఇంటికే.. చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్య కీలక పోరు

CSK vs SRH: ఐపీఎల్ 2025 లో ప్లేఆఫ్ రేసు చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు, చాలా జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఛాంపియన్ జట్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఈ రెండు జట్లు టాప్ 4 రేసు నుంచి బయటపడనున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది.

ఇవాళ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చెన్నై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా, రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో తమను తాము కాపాడుకోవాలని చూస్తున్నాయి. అయితే, ఇందుకోసం ఇరుజట్లు 100 శాతం పోరాడేందుకు సిద్ధమయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ పాయింట్ల పట్టికలో పేలవమైన స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తలో 8 మ్యాచ్‌లు ఆడి కేవలం చెరో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. దీంతో ఇరుజట్లకు తలో 4 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా, పాట్ కమ్మిన్స్ జట్టు తొమ్మిదవ స్థానంలో, ఎంఎస్ ధోని జట్టు పదో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలవగా , చెన్నై కూడా ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు విజయం కోసం పోరాడుతున్నాయి.

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. చెన్నై జట్టు ఈ ఏడాది కనీస ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతుంటే బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్‌ మూల్యం చెల్లించుకుంటోంది.

ఇరు జట్లకు మరో ఆరేసి మ్యాచ్‌లు మిగిలి ఉండగా అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తేనే సులువుగా ప్లే ఆఫ్స్‌కు చేరే చాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్న పిచ్‌పై హైదరాబాద్‌ను పడగొట్టి ముందంజ వేయాలని ధోనీ సారథ్యంలోని చెన్నై భావిస్తోంది.

మరోవైపు బ్యాటింగ్‌ లోపాలను సరిచేసుకొని తిరిగి భారీ స్కోర్లతో విజృంభించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ చూస్తోంది. బుధవారమే హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో ముంబై చేతిలో ఓటమి మూటగట్టుకున్న రైజర్స్‌ 48 గంటలు తిరిగేసరికి చెన్నైతో మ్యాచ్‌కు రెడీ అయింది. మరి ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయాలతో సహవాసం చేస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

రెండు జట్లు పేలవంగా తయారయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా 43వ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం కొంచెం కష్టం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సొంత మైదానంలోని పరిస్థితులే. దీని నుంచి చెన్నై ప్రయోజనం పొందవచ్చు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైందని నిరూపించుకుంటోంది. ఈ కారణంగా చెన్నైపై గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button