ఆంధ్ర ప్రదేశ్

పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్

పోలీస్‌ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో ప్రభాకర్‌ పరారీ అయినట్టు రాజమండ్రి పోలీసులు చెబుతున్నారు.

ఏపీ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్‌లోని ప్రిజమ్ పబ్బు కాల్పుల కేసులో కీలక వ్యక్తిగా ఉన్నాడు. కేసుల నిమిత్తం హైదరాబాద్ నుండి పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. బత్తులపై తెలంగాణ, ఏపీల్లో అనేక కేసులున్నాయి. గతంలో బత్తుల ప్రభాకర్ వద్ద 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు.

అంతేకాదు ప్రభాకర్ శరీరంపై వెరైటీగా మూడు టాటూలు ఉన్నాయి. ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకున్నప్పుడు ఓ చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని తెలిపారు. వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. బత్తుల ప్రభాకర్‌ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్‌ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్‌ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button