Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్నారు. అయితే మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు. కాగా.. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే 50కిపైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుం డగా.., మళ్లీ తమదే అధికారం అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మరోవైపు ఈ నెల 5న వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రకటించాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. బరిలో 699 మంది అభ్యర్థులు దిగారు. ఇవాళ వారి భవితవ్యం తేలనుంది. ఇక ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ శాతం 60.54గా నమోదు అయినట్లు ఈసీ అధికారికంగా వెల్లడించింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ల దగ్గర మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడు అందరి కల్లు అటువైపే. ఢిల్లీ దిల్ ఎవరు గెలుస్తారో అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చీపురు మళ్లీ ఊడ్చేస్తుందా..? కమలం వికిసిస్తుందా..? లేదా హస్తం పార్టీ ప్రభావం చూపుతుందా అన్నది చర్చనీయాంశమైంది. బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? ఏపార్టీ అధికారంలోకి రానుంది.. ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. దీనికి మరికొద్ది గంటల్లో పుల్ స్టాప్ పడనుంది.
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 60.54 శాతం ఓటింగ్ నమోదైంది. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య జరిగింది.
అరవింద్ కేజ్రీవాల్.. న్యూ ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిశీ.. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా, బీజేపీ నుంచి రమేశ్ బిదురి పోటీలో ఉన్నారు. జంగ్ పురా స్థానంలో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, బీజేపీ నుంచి తర్విందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి సింగ్ మర్వా బరిలో ఉన్నారు. శాకూర్ బస్తీలో ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్, బీజేపీ నుంచి కర్నైల్ సింగ్ పోటీలో ఉన్నారు.
ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 25 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాలి. పోల్ ఆఫ్ పోల్స్‌లో కూడా బీజేపీకే ఆధిక్యం లభించింది. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి.