సినిమా

కారులో చిన్నారిని మరిచి దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులు.. కాపాడిన కానిస్టేబుల్

మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లిన తల్లిదండ్రులు కారులో పాపను మరిచిపోయారు. శ్వాస ఆడక ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఆలయ సిబ్బంది, పోలీసులు ఆ పాపను ప్రాణాపాయం నుంచి రక్షించారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన రాజు తన భార్య, పిల్లలు, మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం కారులో మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం వెళ్లారు. తమ వాహనాన్ని నంది సర్కిల్లో నిలిపారు.

ఇందులో తమ ఏడాదిన్నర వయసున్న చిన్నారి నిద్రిస్తోంది. చిన్నారిని భర్త తీసుకొస్తాడని భార్య.. తన భార్య తీసుకెళ్లిందనుకొని మూత్రవిసర్జనకు వెళ్లిన భర్త వేర్వేరుగా దర్శనానికి వెళ్లిపోయారు. దీంతో చిన్నారి కారులోనే ఉండిపోయింది.

కారు అద్దాలన్నీ మూసి ఉండి, తలుపులు లాక్‌ పడిపోవడంతో చిన్నారికి ఊపిరాడక, చెమటలు పోసి నిద్రలేచి ఏడుస్తోంది. కారులో చిన్నారిని స్థానికులు గమనించి దేవస్థానం సమాచార కేంద్రంలోని రికార్డ్‌ అసిస్టెంట్‌ ఈశ్వర్, పొరుగుసేవల ఉద్యోగి నాగార్జునరెడ్డికి తెలిపారు. వారు వెళ్లికానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు చెప్పగా ఆయన రాయితో కారు అద్దాలు పగులగొట్టి చిన్నారిని బయటకు తీశారు.

ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాపకు సమాచార కేంద్రంలో సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. దేవస్థానం మైకుల ద్వారా ప్రకటించగా 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఆ పాపను తీసుకువెళ్లారు. చిన్నారిని కాపాడేందుకు కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ చూపిన చొరవను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button