Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక అసలేం జరిగింది?

Jagdeep Dhankhar: వివాదాస్పద అలహాబాద్ హైకోర్టు జడ్జి తొలగింపు తీర్మానం, అంతిమంగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ రాజీనామాకు కారణమైందా అంటే ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం అవుననే అంటున్నాయి. ఉపరాష్ట్రపతి రాజీనామాకు కేంద్రం నుండి వచ్చిన ఫోన్ కాల్, ఘర్షణకు కారణమైందని తెలుస్తోంది. రాజీనామా తప్ప మరో గత్యంతర లేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడానికి కారణం, అవిశ్వాస తీర్మానం అవమానం నుండి ఆయనను కాపాడటానికేనన్న ప్రభుత్వవర్గాలు చెబుతున్నా ఇంకా ఏదో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక నివాసంలో భారీగా నగదు రికవరీ అయిన తర్వాత, జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీస్, ఉపరాష్ట్రపతి రాజీనామాకు కారణమని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఉపరాష్ట్రపతికి నోటీసు అందించారు.
ఛైర్మన్ ధన్‌ఖడ్ నోటీసును ఆమోదించి, తీర్మానం చర్చించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ జనరల్‌ను కోరారు. దీంతో మొత్తం వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కేంద్రం అగ్గిమీద గుగ్గిలమయ్యింది. ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చిన నోటీసును ఉపరాష్ట్రపతి ఆమోదించడమంటే, న్యాయమూర్తిపైనా, న్యాయవ్యవస్థపైనా అవినీతిపై దాడికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోవడమేనని ప్రభుత్వం భావించింది.
ఒక్కసారిగా ప్రభుత్వ పెద్దలు ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఐతే కేంద్రం వాదనకు భిన్నంగా ఉపరాష్ట్రపతి పదునైన వ్యాఖ్యలతో స్పందించారని సమాచారం. ఫోన్ కాల్ ఒక్కసారిగా ఉభయల మధ్య వాదన ఎక్కువైంది. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి రూల్స్ వివరించారని తెలుస్తోంది. తీవ్రమైన ఫోన్ కాల్ తర్వాత, ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతిపైనా మరోసారి అవిశ్వాస తీర్మానం తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలియడమే కారణమని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితమే విపక్షాలు ఉపరాష్ట్రపతిపై అవిశ్వాసం ప్రవేశపెట్టాయి.
ఇలాంటి పరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకుండా ఉండరాదనే, తనే రాజీనామా చేయాలని ధన్‌ఖడ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9.25 గంటలకు, ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను ఆయన షేర్ చేశారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వైద్యుల సలహాలను పాటించడానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. పదవీకాలంలో సాయం చేసినవారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
మొత్తంగా ఉపరాష్ట్రపతి రాజీనామా ప్రభుత్వవర్గాల్లోనూ, ఇటు విపక్షాలకు షాక్ కలిగించాయి. ఆరోగ్య కారణాల వల్ల కూడా ఉపరాష్ట్రపతి వీడ్కోలు కాకుండా ఉండివచ్చని చర్చ సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ పరిణామం చెప్పలేని రహస్యం ఏదో ఉందని అంటున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగిన బీఏసీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు లేకపోవడంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం పరిణామాలు ఉపరాష్ట్రపతిని బాధపెట్టి ఉండొచ్చని వారన్నారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తున్నప్పుడు సమయంలో సభా నాయకుడు నడ్డా వ్యాఖ్యలు కూడా చైర్‌ను అగౌరవపరిచాయని ఇది కూడా ధన్‌ఖడ్ కలతకు కారణమైం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఐతే తమకు వేరే కార్యక్రమం ఉండటం వల్ల బీఏసీ సమావేశానికి రాలేకపోయామని, ముందుగానే సమాచారం కూడా ఇచ్చామని తాజాగా నడ్డా అన్నారు.
చైర్‌ను అవమానించారన్న విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను విపక్షనేత మల్లికార్జున ఖర్గే గురించి మాట్లాడితే దాన్ని చైర్‌కు ఎలా ఆపాదిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి రాజీనామా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనిపై ఉపరాష్ట్రపతి లేదా ప్రభుత్వానికి మాత్రమే సమాచారం ఉంటుందన్నారు.