తెలంగాణ

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్

BC Reservations: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పాత రిజర్వేషన్‌తోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లైంది. ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లైంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9పై హైకోర్టు అక్టోబర్ 9న స్టే విధించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ ఓ విషయాన్ని చెప్పింది. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి అనేది ఎక్కడా లేదనీ, అది కేవలం మార్గదర్శక సూత్రమేనని తెలిపింది.

ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచవచ్చు అని ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల.. రాజ్యాంగంలో లేకపోయినా సుప్రీంకోర్టు తీర్పు కూడా రాజ్యాంగం పరిధిలోకి వస్తుంది. కాబట్టి కేంద్రం, రాష్ట్రాలు దాన్ని పాటించాల్సి ఉంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసినట్లైంది.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సర్వే ప్రకారం బీసీలు 56.33 శాతం జనాభా కలిగి ఉన్నారని ప్రభుత్వం వాదించింది. ఈ ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచినట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని శాసనసభ, శాసనమండలి ఆమోదించాయనీ, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లులను పంపినట్లు పిటిషన్‌లో ప్రభుత్వం తెలిపింది. ఐతే బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి వెళ్తున్నాయి.

అది సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటినట్లు అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించలేదు. పైగా రాష్ట్రపతి ఇంకా బిల్లులను ఆమోదించకుండానే స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు తెస్తూ జీవో నంబర్ 9 ఎందుకు జారీ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో పాత రిజర్వేషన్ విధానంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘంతో దీనిపై చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సరిగా డీల్ చెయ్యలేదని స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని లెక్కలోకి తీసుకోకుండా దీనిపై న్యాయపరంగా వచ్చే చిక్కులను లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా నిర్ణయాలు తీసుకొని బీసీలలో ఆశలు పెంచింది.

కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ఆశలు పెంచుకున్న బీసీలకు నిరాశ కలిగినట్లైంది. అసలు ప్రభుత్వం ముందుగానే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకు వెళ్లివుంటే ఇప్పుడు బీసీలకు ఇలా నిరాశ కలిగే పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ నెక్ట్స్ స్టెప్స్ అయినా జాగ్రత్తగా వేయకపోతే, అవి మరిన్ని చిక్కులకు దారితీసే అకాశాలు ఉంటాయనుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తమిళనాడు రిజర్వేషన్లకు షెడ్యూల్ 9 ఎలా రక్షణ కలిపించింది? అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్ల విషయంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించినప్పటికీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం జరిగింది.

అయితే భారత రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికారాలతో ఉన్నత న్యాయస్థానం ప్రతి అంశంపై జ్యుడీషియల్ రివ్యూ చేసే అవకాశం ఉంది. కానీ, దాన్ని వ్యతిరేకించే శక్తులు ఉన్నత న్యాయస్థానాల్లోకి వెళ్లి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ సందర్భంలో మరీ ప్రత్యేకంగా భూసంస్కరణలు అమలు అంశం చర్చకు వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేక జాబితా తొమ్మిదవ షెడ్యూల్ ను రూపొందించడం జరిగింది . దీంట్లో కొన్ని చట్టాలను చేర్చి వాటిని న్యాయ పరిశీలన నుంచి రక్షించడానికి ఉపయోగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button