తెలంగాణ

కాళేశ్వరంపై విచారణ జరపండి

కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై శాసనసభలో చర్చ తర్వాత.. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్రప్రభుత్వం పంపింది. నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకొని రాష్ట్ర హోం శాఖ నుంచి కేంద్ర హోం శాఖకు లేఖను పంపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి, అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరిపి జులై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్‌ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు.

సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి, ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పైన కూడా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజి ఏడో బ్లాక్‌ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజి మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది.

అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్య తీసుకొనే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా పేర్కొంది. ఐఏఎస్‌ అధికారులు, ఇంజినీర్లపై చర్యలకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది.

తెలంగాణలో కేసుల విచారణ చేపట్టడానికి సీబీఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతివ్వాలని దస్త్రాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button