తెలంగాణ

తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వణికిపోతున్నాయి.

ఈ చలి వాతావరణం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన చలి కారణంగా శరీర ఉష్ణోగ్రత పడిపోవడం, ఫ్రాస్ట్‌బైట్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. చల్లని వాతావరణంలో రోగ నిరోధక శక్తి మందగించడం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు.

ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారిలో లక్షణాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, చర్మం పొడిబారడం, పగలడం వంటి సమస్యలు కూడా అధికమవుతాయని తెలిపారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొన్ని వర్గాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులతో పాటు ఆరుబయట పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీరు తాగడం, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌లు వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఆస్తమా రోగులు తమ ఇన్‌హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button