Revanth Reddy: విద్యావిధానంపై సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరిగేలా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం సమీక్ష సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా ఉద్యోగాలు కొద్దిమందికి రావడం వెనక స్కిల్స్ లేకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు.
విద్యా శాఖకు 21 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందని విద్యాభివృద్ధికి ఏమాత్రం సరిపోవడం లేదని సమీక్షలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్‌లో లోపాలు ఉన్నట్లు సీఎం తెలిపారు.
విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరినట్లు సీఎం తెలిపారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.



