తెలంగాణ

కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

నేడు తెలంగాణలో మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో కీలకమైన ‘జూమ్’ మీటింగ్ నిర్వహించారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఒక్కటి కూడా చేజారవద్దని, అవన్నీ హస్తగతం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు.నేడు జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారాన్ని దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందో పార్లమెంట్ ఇన్‌ఛార్జిలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించాలని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకూడదని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 గెలుచుకోగా, 33 చోట్ల హంగ్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. 7 కార్పొరేషన్లలో 4 కాంగ్రెస్‌కు, 1 బీజేపీకి దక్కగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్లు, ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇప్పటికీ బిఆర్ఎస్ సభ్యులేనని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేయడంతో, ఆ పార్టీ అధిష్టానం వారిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని రచించింది. మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్-అఫీషియో ఓట్లపై వీరందరికీ పార్టీ ‘విప్’ జారీ చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.

ఈ పరిణామం పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా తయారైంది. ఒకవేళ వీరు పార్టీ విప్‌ను పాటిస్తే, కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు వారిపై అనర్హత వేటు వేయడానికి బిఆర్ఎస్‌కు బలమైన చట్టపరమైన ఆధారం లభిస్తుంది.

నేడు జరగబోయే ఎన్నికల్లో ఈ రాజకీయ డ్రామా పరాకాష్టకు చేరనుంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌కు గడువు విధించిన తరుణంలో, ఈ విప్ ఉల్లంఘన జరిగితే ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button