అంతర్జాతీయం

జపాన్‌పై చైనా మిస్సైల్ ఫైర్

ప్రపంచ దేశాలను ఇప్పుడు యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏ దేశం మీదకు యుద్ధానికి బయలుదేరుతారో చెప్పలేని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధం తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. ఒక దేశం మరో దేశం మీదకు దాడులకు తెగబడటం, ప్రతిదాడులను తిప్పికొట్టడం, మధ్యలో ఎవరైనా కలుగజేసుకుంటే వాళ్ల మీదకు యుద్ధానికి వెళ్లడం లాంటివి చూస్తున్నాం. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినా రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్, ఇజ్రాయెల్-పాలస్తీనా నడుమ భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చాలాదంటూ..ఇప్పుడు చైనా-జపాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్– ఇరాన్‌లకు తోడుగా చైనా– జపాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఆందోళన అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోని నెలకొన్న యుద్ధాల పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒకవిధంగా వరల్డ్ వార్ 3.0 స్టార్ట్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చైనా-జపాన్ మధ్య శతాబ్దాలుగా చారిత్రక సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ..రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి చారిత్రక సంఘటనలు, వివాదాస్పద యుద్ధ నేరాల జ్ఞాపకాలు ఇప్పటికీ ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి కారణమవుతున్నాయి. జపాన్-చైనా సంబంధాలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, రాజకీయంగా, సైనికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని వ్యాఖ్యలతో… ఈ దూరం మరింతగా పెరిగినట్లైంది.

జపాన్ ప్రధాని సనయె తకైచి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దౌత్యపరమైన సంక్షోభానికి దారితీశాయి. చైనా తైవాన్‌పై దాడి చేస్తే, అది జపాన్ భద్రతకు ప్రాణాపాయకరమైన పరిస్థితి అవుతుందని, జపాన్ సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది . ఇరు దేశాలు ఐక్యరాజ్యసమితిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.

టోక్యో ,బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, చైనాలు జపాన్ సముద్రం నుండి తూర్పు చైనా సముద్రం వైపు అణ్వస్త్ర సామర్థ్యం గల బాంబర్లు జపాన్ దాటి ఎగిరాయి. ప్రతిస్పందనగా జపాన్ ,దక్షిణ కొరియాలు, రష్యన్ ,చైనా వైమానిక దళాలను తమ జెట్‌లను తిప్పికొట్టాయి. రెండు రష్యన్ Tu-95 అణు సామర్థ్యం గల వ్యూహాత్మక బాంబర్లు , రెండు చైనీస్ H-6 బాంబర్లు జపాన్‌లోని ఒకినావా మియాకో దీవుల మధ్య ఎగిరిగాయి. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ ఉమ్మడి కార్యకలాపాలను దేశానికి వ్యతిరేకంగా బల ప్రదర్శనగా అభివర్ణించారు. ఇది జాతీయ భద్రతకు తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తుందని అన్నారు.

దక్షిణ కొరియా సైన్యం కూడా ఏడు రష్యన్ విమానాలు, రెండు చైనా విమానాలు తమ వైమానిక రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. జపాన్ సమీపంలో ఉమ్మడి విమానాలు ఎనిమిది గంటల పాటు కొనసాగిందని రష్యన్ మీడియా నివేదించింది. జపాన్ సైనిక విమానాలపై రాడార్‌లను లక్ష్యంగా చేసుకున్నందుకు చైనాను అమెరికా మొదటిసారి విమర్శించింది. చైనా చర్యలు ప్రాంతీయ శాంతి ,స్థిరత్వానికి అనుకూలంగా లేవని రాడార్ సంఘటనను ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి విమర్శించారు. అమెరికా-జపాన్ కూటమి గతంలో కంటే బలంగా ,ఐక్యంగా ఉంది.

అయితే, అంతర్జాతీయ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటూ శిక్షణ, వ్యాయామ కార్యకలాపాలు సంయమనంతో సురక్షితంగా నిర్వహించబడ్డాయని చైనా తెలిపింది. అంతర్జాతీయ సమాజం తప్పు నుండి తప్పును గుర్తించగలదని ,జపాన్ వైపు నుండి మోసపోకూడదని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా జపాన్ మిత్రదేశాలు తమ అప్రమత్తతను పెంచుకోవాలని చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది . చైనా తైవాన్‌పై దాడి చేస్తే టోక్యో ఎలా స్పందిస్తుందో అనే ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన తర్వాత జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి గత నెలలో వివాదానికి దారితీసింది.

డిసెంబర్ 2025లో ఒకినావా దీవుల సమీపంలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు జపాన్ ఎఫ్-15 యుద్ధ విమానాలపై ఫైర్-కంట్రోల్ రాడార్‌ను లాక్ చేశాయని జపాన్ ఆరోపించింది. ఇది ప్రమాదకరమైన చర్య అని జపాన్ నిరసన తెలిపింది. అయితే, జపాన్ విమానాలే తమ శిక్షణలో జోక్యం చేసుకున్నాయని చైనా వాదిస్తుంది.. తూర్పు చైనా సముద్రంలోని జపాన్ అధీనంలో ఉన్న సెన్కాకు దీవులు వివాదం ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలలో ఒకటి.

చైనా కోస్ట్ గార్డ్ నౌకలు వివాదాస్పద జలాల్లోకి తరచుగా ప్రవేశిస్తున్నాయి, ఇది ఉద్రిక్తతలను పెంచుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, చైనా జపాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా జరిగింది. అయితే, రాజకీయ వివాదాలు ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.

యుద్ధం జరిగే అవకాశాలు ప్రస్తుతం చాలా తక్కువ. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి చాలా ఆధారపడి ఉన్నాయి. జపాన్ చైనా నుంచి చాలా వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అలాగే జపాన్‌లో చైనా భారీగా పెట్టుబడులు కూడా పెడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చైనా పర్యాటకులు జపాన్‌ను సందర్శిస్తారు. ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కేవలం మాటలు, హెచ్చరికలకే పరిమితం అయ్యాయి. జపాన్‌కు వెళ్లవద్దని చైనా తన పౌరులకు సూచించింది, అలాగే జపాన్ సినిమాలు కూడా చైనాలో నిషేధించబడ్డాయి. కానీ ఇంకా నిజమైన యుద్ధం ఇరుదేశాల మధ్య ముగియలేదు. సెంకాకు దీవులు లేదా తైవాన్‌పై ఇరుదేశాల మధ్య ఘర్షణ జరగే అవకాశం ఉంది. కానీ యుద్ధం అనేది వినాశకరమైనదనిగా రెండు దేశాలు అర్థం చేసుకున్నాయి.

ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటిది 1914–19లో.. అనంతరం రెండోది 1939–45 లో వచ్చాయి. వీటి మధ్య రెండు దశాబ్దాల తేడానే ఉంది. ఇప్పుడు తొలి యుద్ధానికి 107 ఏండ్లు కాగా.. రెండోది 80 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇవి రెండు యుద్ధాలు ప్రపంచ రాజకీయాలను, దేశాల సరిహద్దులనూ మార్చేశాయి. అణుబాంబుల పరీక్షలు, వాడకం చేపట్టాయి. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏదేశమూ కోరుకోవడంలేదు. కానీ అదే అనివార్యమైతే.. ఇంతకుముందెన్నడూ చూడని విపత్కర పరిస్థితులను అంతర్జాతీయ దేశాలు ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ప్రతి దేశం, అది చిన్నదైనా, పెద్దదైనా ఎంతో శక్తిమంతమైన అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తయారు చేసుకుంటున్నాయి. దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాల వద్ద అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నాయి. పొరపాటున ఏ ఒక్క దేశంలో ఏదైనా తప్పు జరిగినా అంతర్జాతీయంగా విధ్వంసకర పరిస్థితులకు దారితీయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు ఆయుధాల తయారీకి విపరీతమై న ప్రాధాన్యతను ఇస్తూ.. టెక్నాలజీని రూపొందిస్తూ అంతర్జాతీయంగా అమ్ముకునే స్థితికి చేరాయి. ఇప్పటికే అణు వార్, బయోవార్, సైబర్ వార్ దాటిపోగా.. స్పేస్ వార్ స్థాయికి కొన్ని దేశాలు ఎదిగాయి.

నేటి సాంకేతిక కాలంలో విప్లవాత్మక మార్పులతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అధునాతన యుద్ధరంగంగానూ తయారైంది. దేశాల మధ్య యుద్ధ నీతులు, యుద్ధరీతులూ మార్పు చెందాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాము లు, అధునాతన వాయు నిరోధక రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి . ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా వంటి దేశాలే అంతర్జాతీయంగా ఆయుధ వ్యాపారంలో పోటీపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఆధునిక ప్రపంచం ఒక యుద్ధ రంగంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button