అమెరికా తీరుపై చైనా ఆగ్రహం

రష్యాతో వాణిజ్యం చేయొద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా తీరుపై చైనా తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేసింది.
మిగతా దేశాల సంగతి పక్కన పెడితే రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా అంటూ అమెరికాను నిలదీసింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్ లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. దీనిపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. మిగతా దేశాల కన్నా అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ కు కానీ, రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయలేదని గెంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఆ దేశాలతో సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వివరించారు. ఇతరులపై నిందలు వేసి బలిపశువులను చేయడం మానుకోవాలని అమెరికాకు ఆయన హితవు పలికారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని, రష్యా– ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేయాలని ట్రంప్ కు సూచించారు.