Jayashankar Bhupalpally: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లోకి బర్రెలను తోలిన పాడిరైతు

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు.
పాడి రైతు ఓదెలు తన బర్రెల కోసం ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారు. దీంతో ఆవేదనకు గురైన ఓదెలు ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసులోకి బర్రెలను తోలాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ లోకి గేదెలు రావడంతో అందరూ హైరానా పడ్డారు. కార్యకర్తలు పోలీసులు వాటిని బయటకు పంపించేశారు.
అక్కడే తనకు న్యాయం కావాలంటూ ఓదెలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు. బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలని పాడి రైతు వాపోయారు తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలును ఆయన భార్యను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.