అంతర్జాతీయం

Asif Munir: భారత్‌కు అణుబాంబు బెదిరింపు.. పాక్‌ ఆర్మీ చీఫ్ హెచ్చరిక

Pakistan: పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి భారత్‌కు అణుబాంబు బెదిరింపులు చేశారు. భారత్‌ నుంచి పాకిస్థాన్‌ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే అణుబాంబు సగం ప్రపంచాన్ని ముంచివేస్తుందని హెచ్చరించారు. పాక్‌ సైన్యాధిపతిగా అసిఫ్‌ మునీర్ అమెరికా గడ్డ నుంచి భారత్‌కు అణు బెదిరింపు చేయడం ఇదే మొదటిసారి.

టంపాలో నిర్వహించిన బ్లాక్‌టై విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్‌ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశమని అన్నారు. తమ దేశం ఉనికి పోతున్నట్లు భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామని పేర్కొన్నారు.

అలాగే సింధూ నది అంశాన్ని కూడా ప్రస్తావించారు. భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని.. ఆ తర్వాత 10 క్షిపణులతో దాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు సింధూ నది ఏ భారతీయ కుటుంబానికి చెందిన ఆస్తి కాదన్నారు. మాకు క్షిపణుల కొరత లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు భారత్‌ను హైవేపై నడుస్తున్న మెర్సిడెస్‌ కారుతో, పాకస్థాన్‌ను గులకరాళ్లతో నిండిన చెత్త ట్రక్‌తో పోల్చారు. ట్రక్కు కారును ఢీకొంటే ఎవరికి హాని కలుగుతుందని ప్రశ్నించారు.

భారత్‌ తనను తాను విశ్వగురువుగా చూపించాలని కోరుకుంటుందని కానీ వాస్తవానికి దీనికి దూరంగా ఉందని మునీర్ అన్నారు. కెనడాలో సిక్కు నాయకుడికి హత్య, ఖతార్‌లో 8 మంది భారతీయ నావికాదళ అధికారులను అరెస్టు చేయడం, అలాగే కులభూషణ్ జాదవ్ కేసులను ఆయన ఉదాహరించారు. భారత్‌ అంతర్జాతీయ ఉగ్రవాదంలో పాల్గొంటుందని చెప్పేందుకు ఇదొక తిరుగలేని రుజువన్నారు.

మరోవైపు అసీఫ్‌ మునీర్ అమెరికన్ రాజకీయ, సైనికాధికారులతో సహా పాకిస్థాన్ ప్రవాసులను కలిశారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. కురిల్లా నాయకత్వాన్ని మునీర్‌ ప్రశంసించారు.

అలాగే అమెరికా-పాకిస్థాన్ మధ్య సైనిక సంబంధాలు పెంపొందించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. సైనిక సహకారం గురించి చర్చించేందుకు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌ను కూడా కలిశారు. పాకిస్థాన్‌ను సందర్శించారని కూడా ఆయన్ని మునీర్‌ ఆహ్వానించారు.

ఇదిలాఉండగా గత రెండు నెలల్లో అసిఫ్ మునీర్‌ అమెరికాకు పర్యటించడం ఇది రెండోసారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చమురు ఒప్పందంతో పాటు అనేక సహకార ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌తో కూడా సంబంధాలు పెంచుకుంటోంది. అక్కడ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాక్‌కు సహకరిస్తోంది .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button