తెలంగాణ

BJP: స్థానిక సమరానికి బీజేపీ సమాయత్తం

BJP: స్థానిక సమరానికి కమలం పార్టీ సిద్ధమవుతోందా..! గెలుపు కోసం కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోందా..! లోకల్ వార్‌లో ఆధిపత్యం చూపేందుకు రూట్ మ్యాప్‌ని ప్రిపేర్ చేసిందా..? స్థానిక సమరంలో బీజేపీ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా…! తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం మారబోతోందా? ఈసారి గతానికి భిన్నంగా ఉండబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే… స్థానిక ఎన్నికల్ని ట్రయల్‌ రన్‌గా భావిస్తోందా? వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెల్చుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనుకుంటోందా? ఇంతకీ కాషాయ పార్టీ నయా ప్లాన్‌ ఏంటి? కొత్త సారథి మదిలో ఏముంది?

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో అధికార హస్తం పార్టీకి షాక్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోందట. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్‌ నిర్వహించారు కమలం నేతలు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారట. వర్క్ షాప్‌లో టీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు కమలం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకి దిశానిర్దేశం చేశారు.

కొత్త నాయకులు మరింత ఉత్తేజంతో పని చేయాలని నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. ప్రధానంగా మోడీ 11 ఏళ్ల పాలన కేంద్రం ఇస్తున్న పథకాలను గడప గడపకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయి సమస్య లపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలనే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా కమలం నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తొందర్లో నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మరొకవైపు బీఆర్ఎస్ బలహీన పడుతుండడంతో.. ఆ స్థానాన్ని కమలం పార్టీ చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.

ఏడాదిన్నర కాంగ్రెస్ పాలననూ ప్రజల్లో ఎండకడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. స్థానిక సమరానికి ఇప్పటి నుంచే నేతలను కాషాయ పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు.. సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు పవనాలు ఎక్కువగా అధికార పార్టీ వైపు వీస్తుంటాయి. అధికార పక్షమే దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికలను గెలుచుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నమైన ఫలితాల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావొచ్చని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని.. బీజేపీ ఆశిస్తోంది. స్థానిక సంస్థల్లో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేయాలని అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. అందుకు అనుగుణంగా కమిటీలను కూడా నియమిస్తోంది.

స్థానిక ఎన్నికల సమరానికి అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతోంది తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారథి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు కీలకమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటిదాకా లోకల్ బాడీస్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తక్కువగా ఉండడమే అందుకు కారణమట. అయితే… లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, తెలంగాణలో చేసిన సభ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని డిసైడ్‌ అయ్యారట పార్టీ పెద్దలు.

మొత్తానికి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మరి.. లోకల్ వార్‌లో కమలం పార్టీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button