Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్

Bihar Assembly Elections: బీహార్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 64.66 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం సమర్థవంతమైన నిర్వహణకు నిదర్శనమని ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
గురువారం బీహార్‌లోని 121 నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో ప్రజలు భారీగా ఓటింగ్ చేశారు. తుది గణాంకాల ప్రకారం పోలింగ్ శాతం 65కు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. లఖిసరాయ్, సారణ్ ప్రాంతాల్లో స్వల్పంగా తోపులాటలు జరిగినప్పటికీ, మొత్తం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. గత ఎన్నికల్లో 57.29 శాతం మాత్రమే పోలింగ్ జరగగా, ఈసారి రికార్డును అధిగమించింది.
2000లో నమోదైన 62.57 శాతం పోలింగ్ ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా ఎన్నికల్లో ముజఫ్ఫర్‌పుర్ (70.96%), సమస్తీపుర్ (70.63%), మాధేపుర (67.21%), వైశాలి (67.37%) జిల్లాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. పట్నాలో మాత్రం 57.93 శాతం దాటలేదు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించారు.
ఇక బక్సర్, ఫతుహా, సూర్యగఢలలో కొంతమంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. రెండో దశలో 122 నియోజకవర్గాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు 14న జరుగనుంది. లఖిసరాయ్‌లో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు రాళ్లు, ఆవుపేడతో దాడి చేశారని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల భద్రత దృష్ట్యా భారత్–నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.



