బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్

Bihar: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది.
ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్‌లోని తర్న్‌తారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కాగా దేశంలోనే తొలిసారిగా బ్యాలెట్‌పై అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించబోతున్నామని తెలిపారు. అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ చర్యలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.



