Nandyala: మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం

Nandyala: నంద్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటుచేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈవో వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆ పరపతి సంఘంలో డిపాజిట్’లు చేసుకున్న మహిళలలో తీవ్ర ఆందోళన నెలకొంది.
కొందరు మహిళలు సీఈవో స్వస్థలం కడపకు వెళ్లి అతని గురించి ఆరా తీశారు. దీంతో వారికి నిరాశ మిగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల బాలసుబ్బయ్య ఈ సంస్థలో ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. అతనికి వడ్డీతో కలిపి సుమారు 7 లక్షల 40 వేలు రావాల్సి ఉంది .
అయితే జననీ బ్యాంకు సిబ్బంది బాల సుబ్బయ్యకు చెక్కు ఇచ్చారు , నగదు డ్రా చేసుకొనందుకు అతని సేవింగ్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళగా జననీ మహిళా బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది. మహిళా బ్యాంకు సీఈఓ వెంకటరమణకు ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ వచ్చింది. 20 రోజుల నుండి అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాదు కోవెలకుంట్ల పట్టణాని కె చెందిన హరిప్రియ అనే మహిళను బ్యాంకు ట్రెజరర్‌గా నియమిస్తున్నానని ఆమె నుండి 8 తులాల బంగారు , ఐదు లక్షల నగదు తీసుకున్నారు . బంగారం లాకర్‌లో ఉంచుతానని చెప్పి అధిక వడ్డీ పేరుతో మోసం చేశాడని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్యాంకు సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు. తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి తెలిపారు.
కడప పట్టణానికి చెందిన వెంకటరమణ స్థానికంగా ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని నంద్యాల జిల్లాలో 5 బ్రాంచ్ ల ఏర్పాటు చేసాడు. కోయిలకుంట్ల తో పాటు , చాగలమర్రి , బనగానపల్లె , నంద్యాల తదితరచోట్ల జననీ మాక్స్ లిమిటెడ్ సంస్థ పేరుతో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు. వేలాది మంది మహిళల నుండి సుమారు 2 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్టు తెలుస్తోంది.
అయితే కడపకు చెందిన వెంకటరమణ పక్కా ప్రణాళికతోనే ఈ ప్లాన్ చేసినట్టు పలువరు ఆరోపిస్తున్నారు. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీగా రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు వెంకటరమణ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు సీఈవోను పట్టుకుని తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని మహిళలు కోరుతున్నారు.