News

Bhogi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు

Bhogi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ప్రజలు సందడి చేశారు. గ్రామాల్లో, నగరాల్లో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు.

కడపలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు-వాడ భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. భోగి మంటలు వేసి.. దాని చుట్టూ మహిళలు చేరి కోలాటాలు ఆడుతూ సందడి చేస్తున్నారు. రంగవల్లులు వేసి వేడుకలు జరుపుకుంటున్నారు.

మంచిర్యాలలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేడుకల్లో పాల్గొని.. ఆటపాటలతో సందడి చేస్తున్నారు జనం.

నల్గొండలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. 38వ వార్డు శివరాం నగర్‌లో జైశ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని.. ఆటపాటలతో సంప్రదాయ నృత్యంతో సంబరాలు జరుపుకున్నారు.

కార్యకర్తల మధ్య భోగి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో భోగి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భోగి మంటలు వేసి సందడి చేశారు మంత్రి. తన విజయం కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధే అజెండాగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు నారాయణ.

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. భోగభాగ్యాలనిచ్చే భోగి, పిల్లా పాపలతో.. గంగిరెద్దుల కోలాహలంతో రైతన్నల సంక్రాంతి.. పిండి వంటల ఘుమఘుమల కనుమ.. ప్రతి లోగిలిలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రం పాడి పంటలతో.. సిరి సంపదలతో తులతూగేలా వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.

ఏలూరులో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బటేడి చంటి తన క్యాంప్ కార్యాలయంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలంతా శుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్య కూడళ్లు, ఆలయాల వద్ద బోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. నరసాపురంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వనువులమ్మ తీర్థం దగ్గర జరిగిన భోగి వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. అమ్మవారిని దర్శించుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలో భోగి వేడుకలు అంబరాన్నాంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు అలరించాయి. సుల్తానాబాద్‌లో భోగిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు స్థానికులు. భోగి మంటలు వేసుకుని.. దాని చుట్టూ ఆడుతూపాడుతూ చిన్నా పెద్దా సందడి చేశారు. నృత్యాలతో యువత హోరెత్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button