Balapur Laddu 2025: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

Balapur Laddu 2025: హైదరాబాద్ భాగ్యనగరంలో వినాయక చవితి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ఎంతో ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా నిర్వహించబడింది. ఊరి బొడ్రాయి వద్ద జరిగిన ఈ వేలంపాటలో మొత్తం 38 మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ సంవత్సరం లడ్డూ వేలంలో ₹35 లక్షలు పలికింది. ఇది గతేడాది ₹30 లక్షల వెయ్యి రూపాయల కంటే ₹4.99 లక్షలు అధికం. కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూని దక్కించుకున్నారు. 1994లో ₹450 రూపాయలతో ప్రారంభమైన ఈ సంప్రదాయమైన లడ్డూ వేలంపాట ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ప్రత్యేకంగా గణపతి లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే నగదును ఊరి అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఉత్సవ సమితి సభ్యులు చెప్పినట్టు ఇప్పటివరకు ₹1.64 కోట్లకి పైగా గ్రామాభివృద్ధి పనులకు ఖర్చు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరై, “బాలాపూర్ లో పుట్టిన ప్రతి వ్యక్తి అదృష్టవంతుడు. గణనాథుని ఆశీర్వాదం మా గ్రామానికి గొప్ప వరం” అని పేర్కొన్నారు. ఆమె ప్రత్యేకంగా ఈ వేళా కార్యక్రమాన్ని ఘనంగా జరిపిన ఉత్సవ సమితికి అభినందనలు తెలియజేశారు.
దశరథ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “2019 నుండి చాలా ఎదురుచూసిన తరువాత, ఈ సంవత్సరం బాలాపూర్ గణేశుడి లడ్డూని దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను” అని తెలిపారు.



