Nellore: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి

Nellore: ఆ నాయకుడి మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్ధిపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా మాజీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగింది. ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు సైతం ఆందోళనకు దిగారు. ఇంతకూ ఆ నాయకుడెవరు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఆయన కామెంట్స్‌పై ఎందుకీ కాంట్రవర్సీ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన దుండగులు ఫర్నీచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న కారుతో సహా ఇంట్లోని ఏ వస్తువునూ మిగలనివ్వలేదు. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.
అంతకు ముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతిరెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ పిచ్చోడు కాబట్టి ఆమె మాయలో పడ్డారని కామెంట్ చేశారు.
ప్రభాకర్‌రెడ్డిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ప్రశాంతి రెడ్డి పెళ్లి చేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడాఆమె వల్ల సంతోషంగా లేరని ఇదేమి ఖర్మని బాధపడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రశాంతి రెడ్డి వల్ల ప్రభాకర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ప్రభాకర్ రెడ్డిని లేపేయడానికి ఇప్పటికే మూడు సిట్టింగులు పూర్తయినట్లు తనకు సమాచారముందన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డిని నిద్రలోనే లేపేస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి ఓ పిచ్చోడని ఎవరూ దొరకనట్టు ప్రశాంతిరెడ్డిని చేసుకున్నారని ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ కామెంట్ చేశారు. ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయి. మంచోడు, తెలివైన వాడని పేరుంది జాగ్రత్తగా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి.
కోవూరు సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తరువాతే ఆయన ఇంటిపై దాడి జరిగింది. దీనికంతటికీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్గీయులే కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా ఆమె వర్గీయులు, అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెప్తున్నారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఓ సీనియర్ నాయకుడి నివాసంపై దాడి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై జరిగిన మొదటి దాడి ఇది. కోవూరు నియోజకవర్గంపై నల్లపరెడ్డి కుటుంబానికి గట్టి పట్టు ఉంది. దాడి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పలువురు నాయకులు ప్రసన్న ఇంటికి చేరుకున్నారు.
జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ప్రసన్న కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ దాడి ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నల్లపరెడ్డి ఇంటిపై దాడి ఘటనకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదే బాధ్యత అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి ప్రతీకారం దాడులు తప్పవని హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి పాలనలో మాజీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేసి, వీరంగం సృష్టించారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు.
కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని ప్రభుత్వ పెద్దలే ఈ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. రాజ్యంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వంటి నాయకులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. వారు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.
వైసీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని తెలిపారు. దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని. వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంతి రెడ్డి చెప్పుకొచ్చారు.
నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ల ఇంట్లో మహిళలకు చూపించాలన్నారు. నల్లపరెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలనైతే ఆపగలిగాం కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న వీపీఆర్ అభిమానులను ఆపలేకపోయామన్నారు. నల్లపురెడ్డివ్యాఖ్యలను జగన్ సీరియస్‌గా తీసుకోవాలన్నారు ప్రశాంతి రెడ్డి.
మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు నల్లపరెడ్డి ఇంటిపై దాడి జరగ్గా మరోవైపు నల్లపరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు రోడ్డెక్కారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.