Chittoor: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటన కుప్పం మండలం మార్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఆమెను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవటంతో 60శాతంకుపైగా కాలిన గాయాలు అయ్యాయి.
బలవన్మరణానికి పాల్పడిన యువతి పేరు ప్రశాంతి. ఆమె ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కుప్పంకు చెందిన యువకుడు వాసుతో ప్రశాంతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల క్రితం వాసు ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసి కుప్పంకు వెళ్లిపోయాడు. ఆ తరువాత అతనికి మరో యువతితో వివాహం జరిగింది.
దీంతో యువతి ప్రశాంతి వాసు ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు ప్రశాంతికి నచ్చజెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రశాంతి పెట్రోల్ బాటిల్ తీసుకొని మళ్లీ వాసు ఇంటి వద్దకు వెళ్లింది.
అతని ఇంటి ఎదురుగా పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసి కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.