Nepal: నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి ఆర్మీ

Nepal: నేపాల్ ఉద్రిక్తతల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది. ఖాట్మండు సహా అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించింది. ఆందోళనలు శాంతియుతంగా చేయాలని, హింసాత్మకంగా చేస్తామంటూ రెచ్చిపోతే తాము చూస్తూ ఊర్కోమని, ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ హెచ్చరించారు. దోపిడీలు, దహనాలు, విధ్వంసం కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రజల భద్రత, జాతీయ వారసత్వం, ప్రజా ప్రైవేట్ ఆస్తులను రక్షించడం మా బాధ్యతని ఆయన టెలివిజన్ ప్రసంగంలో అన్నారు. హింస, దోపిడీ, దాడులు శిక్షార్హమైన నేరాలుగా పరిగణించబడతాయని ఆయన హెచ్చరించారు. ఇవాళ కూడా ఖాట్మండు వీధుల్లో హింస, దోపిడీ, అగ్నిప్రమాదాల దృశ్యాలు కనిపించాయి. కెపి శర్మ ఓలి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత దేశంలో శాంతి భద్రతల కోసం నేపాల్ సైన్యం ముందుకొచ్చింది. మరోవైపు ఈ అశాంతి ప్రభావం భారత్‌పై పడకూడదని భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
సరిహద్దు వెంబడి పోలీసు బలగాలు, సశస్త్ర సీమా బల్ SSBతో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు దాటే కదలికను పరిమితం చేశారు. వాణిజ్య రవాణా కూడా కొంతవరకు నిలిచిపోయింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో నేపాల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 3 కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, అవినీతి పట్ల అసహనం పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియా నిషేధం ఆ అసహనానికి కారణమైంది. దీంతో దేశం మొత్తం అల్లకల్లోలం రేగింది.
సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ప్రారంభమైన యువత నేతృత్వంలోని నిరసనలు ఇప్పుడు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ భవనం, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ ఆఫీసులపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసు చర్యలో ఇప్పటివరకు కనీసం 19 మంది నిరసనకారులు, ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత భగ్గుమంది. జనరల్ జెడ్ పేరుతో నిరసన బృందాలు అవినీతి, అసమానతలపై పోరాటం కొనసాగుతోంది. పరిస్థితి ఎటు తిరుగుతుందో అన్న ఆందోళన మధ్య పొరుగుదేశం భారత్ కూడా అలెర్ట్‌గా ఉంది.



