ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం మానవతా సాయం

మానవత్వానికి ఎల్లలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. యుద్ధం కారణంగా స్వదేశం వెళ్లలేక, ఇక్కడ ఉండటానికి ఆర్థిక వనరులు లేక విశాఖపట్నంలో ఇబ్బంది పడుతున్న ఇద్దరు ఇరాన్ విద్యార్థినులను జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. ఇరాన్‌కు చెందిన సాల్మాజ్ మొహమ్మది, జీనాబ్ మొహమ్మది అనే సోదరీమణులు తమ పిల్లలతో కలిసి ఫార్మసీ ఇంటర్న్‌షిప్ కోసం గతేడాది విశాఖకు వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో వీరు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, ఇరాన్‌లో యుద్ధం నెలకొనడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి.
అటు నుంచి ఆర్థిక సాయం అందక, ఇటు పిల్లల పోషణ భారమై, ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఆ ఇద్దరు విద్యార్థినులు నానా అవస్థలు పడ్డారు. తమ గోడును విశాఖ కలెక్టర్, డీఆర్వో దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. వక్ఫ్ బోర్డు ద్వారా వారికి తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకుని, అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వానికి, విశాఖ అధికారులకు ఆ ఇద్దరు ఇరాన్ విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.



