Gold Rate: రూ.37 వేలకే తులం బంగారం..

Gold Rate: ఒకప్పుడు బంగారం అంటే కలల ఆభరణం… ఇప్పుడు అయితే కేవలం ధనికుల కావాల్సినంత కొనుక్కుంటారనుకునేవారం. ధర గ్రాముకు పదివేల దాటిపోతే, సాధారణ కుటుంబాలు గోల్డ్ కొనేందుకు తటపటాయిస్తుంటారు. కానీ కష్టకాలంలో వినియోగదారులకు ఊరటనిచ్చే కొత్త మార్గానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 9 క్యారెట్ 9K బంగారం ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మన్నికతో, ప్రతిరోజూ ధరించదగ్గ ఆభరణాలుగా ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇటీవల బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, సాధారణ వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేయడం కష్టమవుతోంది.
అమెరికా బంగారు కడ్డీలపై సుంకాలు విధించడం వల్ల ధరలు మరింత పెరిగాయి. దీని ప్రభావంతో జూన్‌లో భారతదేశంలో బంగారం అమ్మకాలు 60 శాతం తగ్గాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం గత నెలలో 9 క్యారెట్ 9K బంగారం కోసం హాల్ మార్కింగ్ ప్రమాణాలను ఆమోదించింది. దీంతో 9K బంగారం ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS హాల్‌మార్కింగ్ వ్యవస్థలో భాగమైంది. అంటే, అన్ని ఆభరణాల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు దీన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం BIS గుర్తించిన బంగారం స్వచ్ఛత జాబితాలో 14K, 18K, 20K, 22K, 23K, 24K ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 9K బంగారం కూడా చేరింది.
ఇక స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసేవారు 24K బంగారం కొంటారు. ఈ సమయంలో 24K వర్సెస్ 9K బంగారం విశ్లేషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 24K బంగారం 99.9% స్వచ్ఛతతో, దాదాపుగా ఇతర లోహాలు లేని బంగారంగా చూడాలి. 9K బంగారం కేవలం 37.5% బంగారం మాత్రమే కలిగి ఉంటుంది. మిగిలిన 62.5% రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలుంటాయి. 9K బంగారం ఎందుకు ప్రాధాన్యమో కూడా తెలుసుకోవాలి.
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాలు, యువ కొనుగోలుదారులు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే 9K బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది చౌకగా ఉండటమే కాకుండా డిజైన్‌లో వైవిధ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది ఎక్కువ మన్నికగలదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉంగరాలు, చెవిపోగులు, సాధారణంగా ప్రతిరోజూ ధరించే ఆభరణాలకు ఇది అనుకూలం.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 9K బంగారం తక్కువ విలువ కలిగి ఉండటం వల్ల దొంగలకు ఇది అంతగా ఆకర్షణీయంగా ఉండదు. భద్రతా దృక్కోణం నుంచి చూస్తే కూడా ఇది ఒక సరైన ఎంపికని చెప్తారు. 24K బంగారం ధర గ్రాముకు రూ. 10 వేలు సుమారుగా 10 గ్రాములు 1 లక్ష అవుతుంది. ఇక 9K బంగారం గ్రాముకు రూ. 3,700 కాగా, 10 గ్రాములు కేవలం 37 వేలు మాత్రమే. పండుగల సీజన్‌కు బలమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.
రాబోయే పండుగలు, వివాహాల సీజన్ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుంది. రక్షా బంధన్ వేడుక తర్వాత రానున్న వినాయక చవితి, దీపావళి తదితర పండుగల సమయంలో డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, 9K బంగారం ఇప్పుడు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే చౌకైన ప్రత్యామ్నాయంగా మారింది. ఇది బంగారంపై పెరుగుతున్న కోరికను తీర్చడమే కాకుండా, ఆభరణాల రంగంలో కొత్త అవకాశాలను తెరిచింది.



