Imran Khan: ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారా?

Imran Khan: పాకిస్తాన్ రాజకీయాలు మరోసారి సంక్షోభంలో కూరుకుపోయాయి. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ PTI పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నాడా లేదంటే చంపేశారా అన్న చర్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన క్షేమంపై మూడు వారాలుగా కొనసాగుతున్న సస్పెన్స్ యావత్ దేశాన్ని, అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వర్గాల మధ్య గందరగోళం నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతికే ఉన్నాడా? లేడా చంపేశారా, లేదంటే మృతి చెందారా అన్న అనుమానాల మధ్య అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది.
అధికార దుర్వినియోగం, ఇతర కేసుల్లో చిక్కుకొని ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లిన నాటి నుంచి ఆయన పోలీస్ కస్టడీ విషయంలో ప్రభుత్వం సీక్రెసీ మెయింటేన్ చేస్తోంది. జైలు అధికారులు కొన్ని వారాలుగా కుటుంబ సభ్యులను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో అసలు ఇమ్రాన్‌ఖాన్ చంపేసే కుట్ర ఏమైనా జరుగుతుందా అన్న అనుమానం కుటుంబ సభ్యుల్లో కలుగుతోంది. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం రాజకీయ ఖైదీలకు కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు అవకాశం ఇస్తారు.
కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతివ్వకపోవడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బలూచిస్తాన్‌కు చెందిన ఒక ప్రత్యేక గ్రూప్ ఏకంగా ఇమ్రాన్‌ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హత్య చేసిందంటూ ఆరోపించింది. ఓవైపు ఆఫ్ఘన్ అధికార వర్గాలు, మరోవైపు బలూచ్ వర్గాల వ్యాఖ్యలతో ఇమ్రాన్ హత్య విషయం, దావానలంలా పాకిస్తాన్ మొత్తం వ్యాపించింది. ఐతే ఇమ్రాన్ ఖాన్‌పై వచ్చిన హత్య వార్తలను తప్పుడు ప్రచారమని, నిరాధారమైనవని పాకిస్తాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇమ్రాన్ ఖాన్ భద్రతపై నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు వెలుపల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. జైలు వెలుపల ధర్నా చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై పోలీసులు దాడి చేసి, లాఠీఛార్జ్ చేయడం కూడా ఆందోళనలు పెరగడానికి కారణమైంది. జైలు లోపల ఇమ్రాన్ ఖాన్‌ను ప్రత్యేకమైన డెత్ సెల్‌లో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణానికి ముందు ఖైదీలను ఉంచే సెల్ కావడం వల్ల అభిమానుల్లో అసహనం, భయం, అనుమానం నెలకొన్నాయి. సస్పెన్స్‌కు తెరదించుతూ, జైలు అధికారులతో, పోలీసు ఉన్నతాధికారులతో కుటుంబ సభ్యుల సుదీర్ఘ చర్చల తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు పర్మిషన్ లభించింది.
ఈ పరిణామం కొంతవరకు ఉద్రిక్తతను తగ్గించినప్పటికీ, అభిమానులు మాత్రం ఆయనను తమ ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాలు మొత్తం ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడా లేడా అన్న దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబ సభ్యుల వర్షన్ అన్నీ కలిపి సంథింగ్ ఏదో జరుగుతుందోన్న భావన కలిగిస్తున్నాయి. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే తమకు చూపించాలని, లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆ పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.



