బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. కోల్‌కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా “భరోసా పత్ర్” పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. చొరబాట్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దులను పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించిన బీజేపీ.. మహిళలకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు 3 వేల రూపాయల భృతిని వాగ్దానం చేసింది. అలాగే రైతులకు మేలు చేసేలా ధాన్యానికి 3,100 రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ముఖ్యంగా, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగులకు 45 రోజుల్లోనే ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని, బెంగాల్ పునర్నిర్మాణానికి 100 రోజుల్లోనే పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు.



