అంతర్జాతీయం

పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

ప్రపంచాన్ని నైతికత పేరుతో శాసించాలనుకునే అమెరికా, తనకు అవసరమైతే ఆ నైతికతను తాకట్టు పెట్టేందుకూ వెనుకాడదు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు మాటలు, మరోవైపు అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇదే అమెరికా అసలైన ముఖచిత్రం. పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదంపై మాట్లాడేటప్పుడు అమెరికా వైఖరి స్పష్టతతో ఇవ్వదు. నందిని పందంటుంది. పందిని నందంటుంది. ఇదే ఆది నుంచి అమెరికా తీరు. ప్రతి విషయంలోనూ క్లారిటీతో వ్యవహరించాల్సిన అగ్రదేశం ఆ పని మాత్రం చేయదు. దేంట్లోనైనా నాకేంటి అంటుంది.

అవసరాలు సమస్యలు, సంక్షోభాలు ఇవన్నీ కూడా ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న ఆందోళన అమెరికాను వెంటాడుతోంది. ఓవైపు ప్రపంచ దేశాలపై సుంకం మోత మోగిస్తూ నయానో, భయానో లోబర్చుకుంటున్న అమెరికా రోజు రోజుకు సంక్షోభంలో కూరుకుపోతోంది. పాకిస్తాన్ మద్దతుతో జరిగిన పహల్గామ్ దాడి విషయంలోనూ అమెరికా దోబూచులాడింది. ఆ తర్వాత ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలోను ద్వంద్వ వైఖరి అవలంబించింది. ఐతే ఇండియా అమెరికాను లైట్ తీసుకోవడంతో దెబ్బకు దిగొచ్చింది.

పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF‌ను అమెరికా ప్రభుత్వం విదేశీ ఉగ్రవాద సంస్థగా తాజాగా ప్రకటించింది. అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో మైలురాయిగా అభివర్ణించింది. TRF, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా నిషేధిత ఉగ్రవాద సంస్థకు ప్రాక్సీ. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని బైసారన్ వద్ద జరిగిన పహల్గామ్ దాడికి ఈ గ్రూపే బాధ్యత వహించింది. ఈ దాడిలో ఒక నేపాలీ పౌరుడు సహా 25 మంది పర్యాటకులు మృతి చెందారు. మినీ స్విట్జర్లాండ్‎గా పిలిచే ప్రాంతాన్ని రక్తసిక్తం చేశారు పాక్ ముష్కరులు.

ఐతే నాటి ఘటనను బాధ్యత వహించిన TRFని అమెరికా విదేశాంగ శాఖ అణిచివేస్తామని పేర్కొంది. తాజా ప్రక్రియలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలకంగా వ్యవహరించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ TRFను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాద సంస్థలు, వాటి ప్రాక్సీలను అంతర్జాతీయంగా జవాబుదారులుగా నిలిపేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా నిర్ణయంతో పహల్గామ్ దాడికి న్యాయం జరుగుతుందని, జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించబడతాయంది.

తీవ్రవాదంపై భారత్ రాజీపడబోదని ఇప్పటికే అనేకసార్లు కుండబద్ధలుకొట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఎవరు కలిసి వచ్చినా రాకున్నా, ఇండియా మాత్రం దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశ భద్రతకు ముప్పుగా మారాయి. ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలు ప్రత్యక్ష మార్గాన కాకుండా ప్రాక్సీ గ్రూపుల రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహారశైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.

తొలుత పహల్గామ్ దాడిని ఖండించిన అమెరికా ఆ తర్వాత ఇండియా జరిగిన న్యాయపరమైన హక్కులను మాత్రం విభేదిస్తోంది. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై సంయుక్తంగా దాడులు చేయాల్సి ఉండగా అందుకు అమెరికా అడ్డుపడుతోంది. మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన అమెరికా, ఇప్పుడు ఇండియా విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది. ఒకసారి ఇండియాకు అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ డబుల్ గేమ్ ఆడుతోంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button