అంతర్జాతీయం

పాకిస్తాన్‌కు మరోసారి ఆఫ్గాన్ హెచ్చరికలు.. ఏ క్షణమైనా యుద్ధం

పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ అంచుకు చేరుకున్నాయి. టీటీపీ ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యంలో పాకిస్తాన్‌ తన సరిహద్దు దాటి ఆఫ్గాన్‌ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతిగా ఆఫ్గాన్‌ సైన్యం ప్రతిదాడులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. టీటీపీ పాకిస్తాన్‌ లోపల ఉగ్రదాడులు జరుపుతూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. పాకిస్తాన్‌ మాత్రం ఉగ్రవాదులు ఆఫ్గాన్‌ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఆఫ్గాన్‌ కండిస్తోంది. పాక్ రాజకీయ సమస్యలను ఉగ్రవాదం పేరుతో వేరే దేశాలపై మోపుతోందా..? ఈ ఉద్రిక్తల పరిస్థితుల్లో ఆఫ్గాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయమేంటి..?

ఆసియాలో మరో యుద్ధం ప్రారంభం కాబోతుందా అంటే అవునన్నంటే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ అంచుకు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్ పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడుతుంది. పాక్, ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలా మంది చనిపోయారు.

పాక్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రతిదాడులకు సిద్ధం అంటోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా రంగంలోకి దిగి రెండు దేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిర్చాయి. కానీ ఆ ఒప్పందం కాలపరిమితి ముగిసిపోయింది. ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన తదుపరి చర్చల్లో ప్రగతి లేకపోవడం మరోసారి ప్రతిస్పందనాత్మక పరిస్థితిని తీసుకొచ్చింది.

చర్చలు విఫలమవడానికి పాకిస్తాన్‌ వైఖరే కారణమని ఆఫ్గానిస్తాన్‌ ఆరోపిస్తోంది. ఆఫ్గాన్‌ తాలిబాన్‌ ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్‌కు శాంతి ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధానికి సిద్ధమని వార్నింగ్‌ ఇచ్చింది. మరోవైపు పాకిస్తాన్‌ తదుపరి చర్చలకు అవకాశం లేదు అని స్పష్టం చేసింది. దీంతో ప్రాంతీయ శాంతికి విఘాతం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వాతావరణం అశాంతితో నిండి పోయింది. రెండు ఇస్లామిక్‌ దేశాల మధ్య శాంతి భద్రతలు దెబ్బతింటే దాని ప్రభావం సంపూర్ణ దక్షిణాసియా స్థిరత్వంపై పడే అవకాశం ఉంది.

వాణిజ్య మార్గాలు, శరణార్థుల సమస్య, ఉగ్రవాద శక్తుల పెరుగుదల మొదలైన అంశాలు పొరుగు దేశాలకూ తలనొప్పిగా మారవచ్చు. మరోవైపు తెహరికి తాలిబనర్ పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ TTP సంస్థ.. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు తెగబడుతుంది. రైళ్లు పేల్చివేయటం.. బాంబులు పేల్చటం వంటివి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా.. తాలిబన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ఆఫ్ఘన్ తాలిబన్ల డోంట్ కేర్ అన్నట్లు ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమానదాడులకు తెగబడింది.

ఇక్కడ మరో అంశం ఏమిటంటే.. పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశం పంపిస్తుంది పాకిస్తాన్. తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావటానికి శరణార్థులను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించటం ద్వారా.. తాలిబన్లపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది కూడా తాలిబన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2 వేల 600 కిలోమీటర్లు సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోకి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన.

ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్గనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్, ఆఫ్గన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తుంది భారత్..

ఈ క్రమంలోనే ఆఫ్గానిస్తాన్ పాక్‌తో వాణిజ్యం, ప్రయాణాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఆఫ్గాన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి ముల్లా అబ్దుల్ ఘని బరదార్ ఈ ప్రకటన చేశారు. పాకిస్తా‌న్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెంటనే వెతకాలని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య మార్గాలను మూసివేయడం ద్వారా రాజకీయేతర సమస్యలను రాజకీయ ఆయుధాలుగా మార్చకొని పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పదే పదే దెబ్బతీసిందని చెప్పారు. కాబట్టి ఇకపై ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్థాన్‌పై ఆధారపడకూడదని ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం నుంచి సహాయం ఆశించాలని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు, పౌరుల హక్కులను కాపాడటానికి, ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్థాన్‌తో వాణిజ్యాన్ని తగ్గించుకుని.. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వెతకాలని బరాదర్ వెల్లడించారు. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి ఔషధాల దిగుమతి గురించి ఆయన నొక్కి చెప్పారు. ఇవి తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని, అయినా వీటి కోసం ఏటా వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయని, కాబట్టి అన్ని ఔషధ దిగుమతులు ఇతర దేశాల నుంచి తీసుకోవాలని ఆయన తెలిపారు.

కాగా 2025 అక్టోబర్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి కాల్పులు పెరిగాయి. అక్టోబర్ 19న రెండు దేశాల మధ్య రెండు వారాల పాటు జరిగిన ఘర్షణలో డజన్ల కొద్దీ మంది మరణించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఏర్పడింది. కానీ అది విచ్ఛిన్నమైంది. ఆఫ్ఘనిస్థాన్‌లో 6 వేల కంటే ఎక్కువ మంది TTP యోధులు దాక్కుని పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్నారని పాకిస్థాన్ ఆరోపించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉన్న క్లిష్టమైన డ్యూరాండ్ లైన్ ఎల్లప్పుడూ వివాదానికి కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ దీనిని తన సరిహద్దుగా భావిస్తుంది. 1980ల నుంచి పాకిస్థాన్ ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది, అలాగే తాలిబన్లకు కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నారు.

కాగా మొదట్లో పాకిస్థాన్ భారతదేశానికి వ్యతిరేకంగా బఫర్ జోన్‌ను సృష్టించాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఆ దేశం TTP వలకు చిక్కుకుంది. భారత్, తాలిబన్ల మధ్య ఇటీవలి సాన్నిహిత్యం పాకిస్థాన్‌ను మరింత చికాకు పెట్టింది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు భారత్‌ను వివాదంలోకి లాగుతోంది. సైన్యం పరంగా పాకిస్థాన్ బలంగా ఉంది. దాయాది సైన్యం 2017లో చేసినట్లుగానే ఆఫ్ఘన్ సరిహద్దుపై వైమానిక దాడులు చేయగలదు. కానీ తాలిబన్లకు గెరిల్లా యుద్ధంలో అనుభవం ఉంది. వారు సరిహద్దు దాటి దాడులు చేస్తారు. మరోవైపు రెండు దేశాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

పాకిస్తాన్ అప్పు 100 బిలియన్లకు మించి ఉంది. అటూ ఆఫ్ఘనిస్థాన్ కరువుతో పోరాడుతోంది. యుద్ధం రెండింటినీ నాశనం చేస్తుంది. ఇటు పాకిస్తాన్ భారత్, ఆఫ్గానిస్తాన్ రెండితో రెండు వైపులా యుద్ధం చేస్తోంది. ఇంకోవైపు దేశం లోపల TTP, బయట ఆఫ్ఘనిస్థాన్‌తో పోరాడుతుంది. త్వరలో యుద్ధం రాబోతుందని అంటున్నారు. యుద్ధం జరిగితే లక్షలాది మంది చనిపోతారు. ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటికే తాలిబన్ల వల్ల నాశనమైంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ దేశ సరిహద్దులో తన దళాలను పెంచింది.

తన భద్రత పేరుతో దాడి చేస్తున్న పాకిస్తాన్, ప్రతిస్పందన పేరుతో హెచ్చరిస్తున్న ఆఫ్గానిస్తాన్‌ ఇరువైపులా నమ్మకం తగ్గిపోతోంది. మతం, సరిహద్దు, ఉగ్రవాదం అనే మూడు అంశాలు ఈ ప్రాంతాన్ని మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొల్పాయి. పాకిస్తాన్‌కి ఇది రక్షణగా అనిపించినా, ఆఫ్గాన్‌కి ఇది స్వాభిమానంతో యుద్ధ సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికి పాక్, ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒక వేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది మూడు, నాలుగు రోజుల్లోనే క్లోజ్ కావొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button