ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూత

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ‘ప్రేమఖరీదు’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతోపాటు వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ‘అహనా పెళ్ళంట!’, ‘ప్రతి ఘటన’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నెంబర్ 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఉదయం కన్నుమూశారు.
పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్‌గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు కోట శ్రీనివాసరావు.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ ఇక మన నుంచి అక్కడికి వెళ్లిన వారు అరుదు.
కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడనడంలో సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు. దాదాపు 750కి పైగా చిత్రాలో నటించి మెప్పించారు.