యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై మరోసారి కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు.
ఇదే కాకుండా అన్వేష్‌పై ఖమ్మం జిల్లా ఖానాపురంహవేలి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇప్పటికే కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.
ఇటీవల హిందువులు ఆరాధించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోను విడుదల చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దానవాయిగూడేనికి చెందిన జి. సత్యనారాయణరావు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.



