Karregutta: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి

Karregutta: ఎన్ని ప్రభుత్వాలు మారిన… వీ డోంట్ కేర్.. మేము కదం తొక్కితే ఎంతటి ఘనుడైనా మా ముందు తల వంచాల్సిందే. ఇది నిన్నటి వరకు మావోయిస్టుల మాట. కానీ ఇప్పుడు డైలాగ్ మారింది. ప్లాన్ చేంజ్ అయింది అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటుంది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టులకు చెక్ పెట్టడానికి బీజేపీ సర్కార్ ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేసింది.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు కర్రెగుట్ట పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్తో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అంతా వార్‌జోన్‌గా మారింది. దాదాపు 20 రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మావోయిస్టుల రహస్య స్థావరాలు, బంకర్లను గుర్తించారు. మావోయిస్టుల స్థావరాల నుంచి వేల కిలోల పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
మవోల అంతిమ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చింది. తాజాగా బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మావోల మృతిని బస్తర్ ఐజీ, సీఆర్పీఎఫ్ఐసీ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా అక్కడ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టి కాల్పులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి వెళ్లే ముందు ఎక్కడికక్కడ మందుపాతరలు, ప్రెజర్ బాంబులను అమర్చారు. డ్రోన్ కెమెరాలకు మావోయిస్టుల కదలికలు చిక్కినా ఆ ప్రాంతాలకు బలగాలు చేరుకోవడం కత్తిమీద సాముగా మారుతోంది
మరోవైపు 290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 నుంచి 70 మీటర్ల ఎత్తు కొండలతో కర్రెగుట్టల మధ్యన అడవులున్నాయి. రోజుల తరబడి నడక ఒకవైపు ఎండతో తీవ్ర చెమటలు, ఉక్కపోత వంటి ఇబ్బందులకు గురవుతూ.. జవాన్లు డీహైడ్రేషన్ కి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇక భద్రతా బలగాలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలు పంపుతున్నారు.
హెలికాప్టర్ నుంచి మావోయిస్టుల కోసం అన్వేషించడంతో పాటు తాగునీరు, ఇతర సామాగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్నారు. ఈ క్రమంలోనే జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. ఎండకు తోడు మందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో జవాన్లు ఇబ్బందులు పడుతున్నారు.
దట్టమైన కీకారణ్యాన్ని మావోయిస్టుల ఇలాఖా నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మొన్నటి నుంచి వర్షాలు కురిసిన నేపథ్యంలో అడవులు చిగురించాయి. లోపల కొండలు నుంచి జలపాతాలు ప్రవహిస్తున్నాయిమనిషి కాలు పెట్టలేని విధంగా ఊబులు ఉన్నట్లు తెలుస్తోంది. సాయత్రం 3 కాగానే చిమ్మ చీకట్లు ఉంటున్నాయి.
అంతేకాకుండా విష సర్పాలు, పురుగులు సంచరిస్తున్నాయి ఇవన్నీ ఆపరేషన్ కు ప్రతికూలంగా మారాయి. ఒకవిధంగా జవాన్లకు ఆపరేషన్ కత్తిమీద సాములా మారింది. ఎప్పటి కప్పుడు ఉన్నత అధికారుల డైరెక్షన్ లో డిఫెన్స్ హెలికాప్టర్లు, డ్రోన్స్, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా మావోయిస్టులు సొరంగాలు ,స్థావరాలు గుర్తిస్తూ ముందుకు వెళుతున్నాయి.
కర్రెగుట్టలో స్పెషల్ ఆపరేషన్ ఆపాలంటూ పౌర హక్కుల సంఘాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా ఏకపక్షకాల్పులు జరపడం సరి కాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’కు భారీ స్పందన వస్తోందని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. మంగళవారం 14 మంది మావోయిస్టులు ఆయన ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ చేయూత’ను ప్రకటించినప్పటి నుంచి 227 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం.
2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేసే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఎట్టిన పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవడంపై హోమంంత్రి అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కర్రెగుట్టలో కూంబింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది మావోయిస్టులు మరణించారి అధికారులు తెలిపారు.