Jogini Sandhya: అసలు హిజ్రానే కాదు.. అఘోరిపై జోగిని సంధ్య ఫిర్యాదు

Jogini Sandhya: అఘోరి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియా శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరిపై చర్యలు తీసుకోవాలని జోగిని సంధ్య గురువారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగిని సంధ్య మాట్లాడుతూ సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.
అతడు అఘోరి కాదని, అసలు హిజ్రానే కాదన్నారు. ఇప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలిపెట్టాడని, తాజాగా వర్షిని అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అన్నారు. దీంతో అతడి బండారం బయటపడిందని, ప్రభుత్వము, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని, బయట ఎక్కడా తిరగనివ్వద్దని ప్రజలకు సంధ్య విజ్ఞప్తి చేశారు.
తప్పు చేసిన అతడిని శిక్షించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నేను మొదటి నుంచి అగోరి అలియాస్ శ్రీనివాస్ పై పోరాటం చేస్తున్నానని, కత్తులతో దాడి చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నామన్నారు. షామీర్పేట పోలీసులు ఫిర్యాదు తీసుకొని, కేసు నమోదు చేశారని తెలిపారు. త్వరలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సంధ్య తెలిపారు.