సైబర్ నేరగాళ్ల మోసానికి బలైన మేఘా కంపెనీ.. 5 కోట్ల 47 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ప్రముఖ మేఘా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించింది. సైబర్ మోసంపై మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విమెంట్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ లాగానే ఈ మెయిల్‌లో ఒక అక్షరం మార్చి మెయిల్ చేశారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు. మరో అకౌంట్‌కు డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించారు.
అది నిజమని నమ్మి దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు కంపెనీ ప్రతినిధులు. అయితే అదే కంపెనీ నుంచి డబ్బులు చెల్లించలేదని మరో మెయిల్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన మేఘా కంపెనీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.