Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ స్థానాలను చీపురుతో ఊడ్చేసింది. మోదీ, అమిత్ ద్వయంతో.. ఆప్ అగ్రనేతలు, మంత్రులు దారుణంగా ఓడిపోయారు. ఫలితంగా.. 2013 ఆప్ ఏర్పాటు తర్వాత కేజ్రీవాల్ అతిపెద్ద ఓటమిని మూటగట్టుకున్నారు.
చెప్పాలంటే.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయ లేకపోయారు. అయితే ఈ సారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఇందుకు మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళిక తో ముందుకు సాగిన బీజేపీ.. ఆప్‌కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని తమ సొంతం చేసుకుంది.
ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్‌నకు నష్టం కలిగించిందని ఫలితాల సరళి చూస్తే స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ దాదాపు 7శాతానికి పైగా ఓటింగ్‌ను దక్కించుకుంది. ఫలి తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చడం బీజేపీకి కలిసొచ్చింది. ఆప్, కాంగ్రెస్‌కి కలిపి 50శాతం వరకు ఓట్ షేరింగ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీచేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు.
గెలుపు కోసం బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ప్రతి బూత్‌లో కనీసం 50శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వచ్చింది. తద్వారా వ్యతిరేక ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు వారితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కింది.
ఇక కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఢిల్లీ వదలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలిపించారు. వీరిలో ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి దిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్ఠానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకమనే చెప్పాలి.
బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్ఠమైన బాధ్యతలు అప్పగించింది. కేంద్రమంత్రులు ఒక్కొక్కరికీ రెండు నియోజకవర్గాలను కేటాయించి అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ వారే బాధ్యులని స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే బృందం ప్రతిరోజూ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని BJP కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని, అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలు ఇస్తోంది. ఈ ప్రక్రియలో ఆర్‌ఎస్‌ఎస్ కీలకంగా వ్యవహరించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి ఆ పార్టీ ఆ ఇచ్చిన హామీలు అత్యంత కీలకమని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తమ మేనిఫెస్టోనూ ప్రకటించింది బీజేపీ. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21 వేల ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు రూ.2,500 పెన్షన్, వితంతువులు, నిరుపేద మహిళల రూ.2,500 పెన్షన్, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం, ఆటో-టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా, గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు ₹1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకుంది. వీటితో పాటు యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలు ఇచ్చింది.
కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల అంశం మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గేలా చేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది. ఇక ఆప్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి బాగానే కలిసొచ్చింది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్, శీష్‌మహల్ వివాదం, అవినీతి, యమునా కాలుష్యం వివాదం ఆప్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు కేజ్రీవాల్ మానసపుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఈసారి ఓటర్లు పట్టం కట్టలేదు.