Kodi Pandalu: ఉత్కంఠగా మారిన కోడి పందెల వ్యవహారం..

Kodi Pandalu: సంక్రాంతికి కోడి పందెల వ్యవహారం ఉత్కంఠగా మారింది. అటు పోలీసు శాఖ.. ఇటు నిర్వాహకులు ఎవరి పట్టుదలతో వారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆపాలని పోలీసులు.. ఎలాగైనా జరిపితీరుతామని నిర్వాహకులు పంతంతో ఉన్నారు.
దీంతో.. ఈ వ్యవహారంలో ఖాకీలదే పైచేయి అవుతుందా..? లేక ఖద్దరు మాట చెల్లుతుందో అనేది కొద్ది గంటల్లో తేలనుంది.
సంక్రాంతి అంటే కోడి పందేలు.. కాలుదువ్వే పుంజులు.. కరెన్సీ కట్టలతో కాయ్‌రాజా కాయ్ అంటూ సందడి చేసే పందెం రాయుళ్లు. కోడి పందాలను చూసేందుకు, పందాలను కాసేందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు ఉభయ గోదావరి ప్రాంతాలకు. ఈ పందేలపై నిషేదం విధించిన కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
కోడి పందెలకు కోనసీమ జిల్లా రెడీ అయ్యింది. అయితే.. పందెలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పందెం నిర్వాహకులు మాత్రం తగ్గేదేలే అంటూ బరులను సిద్ధం చేసుకుంటున్నారు. పందెంరాయుళ్లకు అండగా రాజకీయ నేతలు ఉండడంతో బాహాటంగానే బరులు సిద్ధమవుతున్నాయి.
కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో కోడి పందెలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని గెస్ట్‌హౌజ్‌లు, లాడ్జ్‌లను బుక్ చేసుకున్నారు పందెం రాయుళ్లు.