Pawan Kalyan: కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరికాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అసియాలోనే పవన, జల, సౌర విద్యుత్ ఉత్పత్తిరంగంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15వేల కోట్ల రూపాయలతో 5 వేల 230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఇది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది.
ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరిస్తారు. ఈ ప్రాజెక్టుకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 1.23 టీఎంసీల నీరు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తవగానే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును సందర్శించినట్లు సమాచారం. ప్రాజెక్టు సందర్శన అనంతరం సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.