మరో వివాదంలో విశాల్?

Vishal: తమిళ నటుడు విశాల్‌ను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఆయన నటించిన ‘మద గజ రాజా’ సినిమా ఇటీవల పెద్ద హిట్ అయింది. కానీ కొత్త చిత్రం ‘మగుడం’ షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా దర్శకుడిని తప్పించి స్వయంగా దర్శకత్వం చేపట్టడమే కారణమని తెలుస్తుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
విశాల్‌కు వివాదాలు కొత్తేమి కాదు. కోలీవుడ్‌లో ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఆయన నటిస్తోన్న ‘మగుడం’ చిత్రం షూటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. క్రియేటివ్ భేదాభిప్రాయాల కారణంగా విశాల్ ఈ సినిమా దర్శకుడు రవి అరసును తొలగించాడు. స్క్రీన్‌ప్లేలో ఎన్నో మార్పులు చేసి, దర్శకుడు లేకుండానే షూటింగ్ మొదలుపెట్టాడు. దీంతో డైరెక్టర్స్ అసోసియేషన్, ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సంస్థలు జోక్యం చేసుకున్నాయి. రవి అరసు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఆదేశించాయి.
ఫలితంగా షూటింగ్ స్తంభించింది. ఇటీవల విడుదలైన విశాల్ ‘మద గజ రాజా’ 12 ఏళ్ల ఆలస్యం తర్వాత సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయింది. ఈ విజయం విశాల్‌కు ఊరట నిచ్చినా, కొత్త సమస్య ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. ఈ వివాదాల నుంచి బయటపడి సినిమాను పూర్తి చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.



