Cyclone Montha: జల దిగ్బంధంలో వరంగల్.. చెరువులను తలపిస్తున్న కాలనీలు

Cyclone Montha: మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేశ్ కాలనీలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో ఆరు పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు.
హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డు పైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్‌లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.



