Delhi Weather: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం..

Delhi Weather: చలితో ఉత్తర భారతం వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ-NRCR ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు దట్టంగా కురుస్తుండడంతో.. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో.. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. గాలి నాణ్యతా సూచి 334గా నమోదైంది. దీంతో.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు విమాన సర్వీసులపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన జారీ చేసింది. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని తెలపింది.
అటు.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రహదారులను మూసివేశారు. దీంతో పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.