తెలంగాణ

బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ పార్టీ కన్ను

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలిచి, గ్రేటర్ హైదరాబాద్ లో బోణీ కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. టిక్కెట్ కోసం పోటీపడే ఆశావహులను బుజ్జగించి, హైకమాండ్ కోరే వారికి జూబ్లీహిల్స్ సీటును కేటాయించడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారింది.

స్ధానిక నేతలందర్నీ ఒకే తాటిమీదకు తేవడం ఓ ఎత్తైతే అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్ధితి ఉంది. ఇలా అన్నీ సమీకరణలకు తగ్గట్లు అభ్యర్ధిని ఖరారు చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్ గా మారింది.

ఎంఐఎం సపోర్ట్ పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్ధికే జూబ్లీహిల్స్ సీటు కేటాయిస్తుందన్న వార్తలు రావడంతో స్ధానికంగా పట్టు ఉన్న కొందరు నాయకులు తమ దారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇవ్వడంతో హస్తం పార్టీకి పాలుపోవడం లేదు. సీఎం రేవంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టిక్కెట్ కోసం వార్నంగ్ ఇస్తున్న ఆ యువనేత వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది..

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్మే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సీటుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికను ఇజ్జత్ కా సవాల్ గా తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ సీటును ముస్లిం మైనారిటీ అభ్యర్ధికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీచేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అజారుద్దీన్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా ఆయనకు సీటు ఖరారు చేయడం అనివార్యమన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు తానే జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగుతానని అజారుద్దీన్ సన్నిహితులకు సంకేతాలిచ్చారని వార్తలు వస్తున్నాయి.

అజారుద్దీన్ అభ్యర్ధిగా ఉంటే తమకు అభ్యంతరం లేదని, ముస్లిం అభ్యర్ధికి తమ మద్దతు ఉంటుందని ఎంఐఎం అధినేత ఓవైసీ కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలిచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ బరిలోకి దిగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ యువనేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కు గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి కూడా నవీన్ కుమార్ పట్ల మంచి అభిప్రాయం ఉంది. గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు.

దీంతో ఈసారి ఉపఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్ తనకే దక్కుతుందని ఆయన భావించారు. కానీ అజారుద్దీన్ పేరు తెరపైకి రావడంతో నవీన్ యాదవ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నవీన్ యాదవ్ బలం ఏమిటో రేవంత్ రెడ్డికి తెలుసని, కాంగ్రెస్ టిక్కెట్ కేటాయిస్తే, ఎంఐఎం సపోర్టుతో సునాయసంగా బీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించగలరని నవీన్ యాదవ్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.

కానీ తమను కాదని కేవలం ముస్లిం మైనారిటీ ఓట్లనే నమ్ముకుని, అజారుద్దీన్ కి గనుక సీటును కేటాయిస్తే ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ తాము సపోర్ట్ చేయబోమని నవీన్ అనుచరులు తేల్చి చెబుతున్నారు. నిత్యం కార్యకర్తలతోనూ ప్రజలతోనూ మమేకమయ్యే లీడర్ ను కాదని, హైకమాండ్ తో లాబీయింగ్ చేసే వారికి టిక్కెట్ ఇస్తే ఇక పార్టీ కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటని నవీన్ యాదవ్ తన సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం.

నవీన్ యాదవ్ తాజాగా ఇచ్చిన వార్నింగ్ తో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో ఆచి,తూచి అడుగేస్తోంది. నవీన్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వకపోతే తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈసారి టిక్కెట్ దక్కకపోతే నిర్మొహమాటంగా బీఆర్ఎస్ అభ్యర్ధికి సపోర్ట్ చేయాలని నవీన్ యాదవ్ తన అనుచరులతో అభిప్రాయపడ్డారట.

తన సత్తాపై తక్కువ అంచనా వేస్తే కాంగ్రెస్ హైకమాండ్ కు తన బలాన్ని నిరూపించుకోవల్సిన పరిస్ధితి అనివార్యమవుతుందని నవీన్ చెప్పినట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా ఉపఎన్నికలో ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని భావిస్తోంది. ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతిచ్చే పక్షంలో నవీన్ యాదవ్ ను రెబల్ గా మార్చి ఆయన మద్దతు పొందగలిగితే అది తమకు కలిసి వస్తుందని కారు పార్టీ లెక్కలు వేసుకుంటోందట.

ఈ పరిణామాలను బేరీజు వేసుకుని నవీన్ యాదవ్ కు టిక్కెట్ కేటాయించలేకపోతే పార్టీకి డ్యామేజ్ జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది నవీన్ యాదవ్ కు వేరే పదవి ఇచ్చి బుజ్జగిస్తుందా అనే విషయాలను వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button