తెలంగాణ

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్

జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారింది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.‌ ఇందు‌కోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. ఉప ఎన్నిక కోసం పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించింది. గెలుపు గుర్రానికే బై ఎలెక్షన్‌లో టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎంఐఎం ఓట్లు కీలకమైన జూబ్లీహిల్స్‌పై బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలిచేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం చేజార్చుకున్న బీఆర్ఎస్ ఈసారి అలా జరగకుండా వ్యూహ రచన చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ బై ఎలక్షన్స్‌లో గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

మాగం గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదోననే అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక‌ సర్వే కూడా నిర్వహించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగి‌‌న ఉప ఎన్నికలో లాస్య నందిత సోదరికి ఉప ఎన్నిక టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. అయితే బై ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన శ్రీగణేష్ విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని బీఆర్ఎస్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు టికెట్ ఆశావాహులు మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి పోటీచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారట.

ఇంకోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభవం నేపథ్యంలో.. బీఆర్ఎస్ ముందే మేల్కొంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.‌ ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించింది. గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ నేతలు బస్తీ ప్రజలను కలుసుకుంటున్నారు‌. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇంఛార్జ్‌లను నియమించింది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఇంఛార్జ్‌ను నియమించారు. ‌అదే సమయంలో పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, నల్లమోతు భాస్కర్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌పై స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నందినగర్ నివాసంలో వారం రోజులు పాటు ఉన్న కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావులతో వరుస సమావేశాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ చెప్పారట. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కేసీఆర్ నిర్ణయించారట.

మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్‌లు బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. ఇదే సమయంలో పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఖరారైదంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే తనకే టికెట్ ఇవ్వాలంటూ గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కేటీఆర్‌ను కలసి విజ్ఞప్తి చేశారట. ఈ నేపథ్యంలో గోపీనాథ్ కుటుంబంలోనే టికెట్ కోసం పోటీ నెలకొందట. అయితే సానుభూతి వర్కవుట్ అవుతుందా లేదా అనే కోణంలో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.‌ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సానుభూతి వర్కౌట్ కాలేదు. దీంతో అభ్యర్థి విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో‌ ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు లక్షా 20వేల ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఈ నేపధ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సమావేశం నిర్వహించారు.

షాదీ ముబారక్ సహా కేసీఆర్ హాయాంలో ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలను ఆ వర్గం ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో మహమూద్ అలీ సహా ఇతర ముస్లిం నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ‌2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం పార్టీ బలంగా నిలబడింది. ఈసారి ఆ మద్దతు కరువయ్యే అవకాశం ఉండడంతో ఏ విధంగా ముందుకు వెళ్తే గెలుపు అవకాశాలు ఉంటాయని కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారట.

మొత్తానికి జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. మరి గులాబీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button