Congress: లోకల్ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా..? పార్టీ పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని భావించి సడన్‌గా ఎందుకు వెనక్కి తగ్గింది..? తొందరపాటు కొంప ముంచుతుందని జాగ్రత్త పడిందా..? ఆలస్యం, అమృతం, విషం అన్న సంగతిని పార్టీ పెద్దలు మరిచారా..? లోకల్ బాడీ ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ చూపిన వారికే పదవులు ఇవ్వాలనే వ్యూహం ఫలించేనా..?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసింది. అందుకు వరుస సమావేశాలు పెట్టి నేతలను సమాయత్తం చేసింది. ఉమ్మడి జిల్లాలకు సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమించింది. అయితే జులై నెలాఖరు వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని హడావిడి చేసిన నేతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయా పదవులకు నేతల పేర్లను రాష్ట్ర నాయకత్వానికి సిఫార్సు చేయడం వరకు మాత్రమే జులైలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆలస్యానికి కూడా పార్టీ వ్యూహం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ పదవులను భర్తీ చేస్తే అక్కడక్కడ పొరపాట్లు దొర్లడం పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. దీంతో ఆ అసంతృప్తి ఎన్నికల సమయంలో పార్టీ నేతలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్‌కి తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర నేతలు లోకల్‌బాడీ ఎన్నికల తర్వాత మాత్రమే పదవుల ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే స్థానిక ఎన్నికలల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపిన నేతలకు గతం కన్నా మెరుగైన ఫలితాలు తీసుకువచ్చే నేతలకు ప్రాధాన్యత ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచనలు చేస్తోందట. ఈ తిరకాసుతో పార్టీ గెలుపు కోసం నేతలు శ్రమిస్తారని దీంతో పార్టీని బలోపేతం చేసినట్లు అవుతుందని ఆశాభావంతో పార్టీ నేతలు ఉన్నారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన పార్టీ ఇంచార్జ్‌లు పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా, బ్లాక్, మండల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు ఏకాభిప్రాయంతో సూచించిన పేర్లు ఒక్కో పదవికి రెండు నుంచి మూడు పేర్లు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కి నివేదిక పంపనున్నారు.
అయితే స్థానిక ఎన్నికల తర్వాతనే పార్టీ పదవులకు పేర్లను ఖరారు చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో నిరాశ మిగిలింది. పార్టీ పదవుల భర్తీ ఆలస్యం చేసే కొద్దీ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులను భర్తీ చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మిస్‌ఫైర్ అయ్యే అవకాశముందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీకి డ్యామేజ్ అయ్యే చాన్సుందని పార్టీ పెద్దలు అంచనాలు వేస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల వేళ మండల అధ్యక్షుల మార్పు కరెక్ట్ కాదని పాత అధ్యక్షులతోనే స్థానిక ఎన్నికల్లో ఫైట్ చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెజారిటీ స్థానాలు లోకల్ బాడీ ఎన్నికల్లో కైవసం చేసుకోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట. దీంతో పార్టీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ పదవులను భర్తీ చేయడమే మంచిదని నేతలు భావిస్తున్నా క్యాడర్ మాత్రం ఆలస్యం అయ్యే కొద్దీ నిరుత్సాహం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి నేతల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ నయా స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.