సెల్ఫీ దిగుదామని చెప్పి కృష్ణా నదిలో భర్తను తోసేసిన భార్య

ఇటీవల భర్తలను పాలిట భార్యలు కాలయముడిలా మారిపోతున్నారు. హానిమూన్ మర్డర్ మొదలుకుని నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట భార్యల చేతిలో భర్తలు హతమవుతున్నారు. తాజాగా ఓ భార్య భర్తను చంపేందుకు సెల్ఫీ స్కెచ్ తో చేసిన విఫలయత్నం సంచలనం రేపింది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవలే పెళ్లయిన ఓ నవ దంపతులిద్దరు బైక్ పై వెలుతున్న క్రమంలో కర్ణాటక రాయచూరు జిల్లా కార్డులూరు సమీపంలో కృష్ణానది దగ్గర ఆగారు. కృష్ణానది పరవళ్లు చూద్దామని ఓ సెల్ఫీ దిగుదామన్న భార్య కోరిక మేరకు బైక్ ను వంతెనపై ఆపాడు.
నది వంతెన అంచునా సెల్ఫీ దిగుదామని చెప్పి అకస్మాత్తుగా భర్తను నదిలో తోసేసింది. నదిలో భర్త జారిపడ్డట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపింది. అయితే అదృష్టవశాత్తు నదిలో పడిన భర్తకు ఈత వచ్చి ఉండటంతో ఈదుకుంటూ నది మధ్యలో గట్టుపైకి చేరుకున్నాడు. వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు.
చావు తప్పించుకుని ఒడ్డుకు చేరిన భర్త తన భార్యనే నన్ను చంపేందుకు కుట్ర చేసిందని సంచలన విషయం వెల్లడించాడు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని నా భార్య సెల్ఫీ దిగుదామని నమ్మించి నదిలోకి తోసేసిందని తెలిపాడు.
అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి హెచ్చరించి పంపించారు.