Donald Trump: వాణిజ్య యుద్ధానికి తెరదీసిన ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం కష్టంగా ఉంది. ఆయన అనుకున్నదే తడువుగా ఇష్టానుసారంగా ఆయా దేశాలపై టారిఫ్స్ అమలు చేస్తున్నాడు. ట్రంప్ తీరుతో వర్ధమాన దేశాలకు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ట్రంప్ మళ్లీ వాణిజ్య యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాగి నుంచి ఔషధాలు వరకు సుంకాల వడ్డింపుతో మోత మోగించాలని చూస్తున్నాడు. 50 శాతం నుంచి 200 శాతం టారిఫ్స్ విధిస్తానంటూ హుంకరిస్తున్నాడు.
దిగుమతి టారిఫ్‌లు, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకోనున్నాయి. భారత్, సహజంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడే ఔషధ, ఖనిజ రంగాలపై ప్రభావం చూపించనుంది. మరోవైపు BRICS దేశాలకు ట్రంప్ హెచ్చరించాడు. ఎవరైనా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు.
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను అమలు తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాగిపై కొత్తగా 50 శాతం సుంకాలు ప్రకటించాడు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక సంవత్సరం తర్వాత 200 శాతం వరకు పెరిగుతాయంటూ కవ్విస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ ఆర్థిక వ్యవస్థలపై అధిక అమెరికా సుంకాలు అమలులోకి రావడానికి ఆగస్టు 1 గడువును పొడిగించని తేల్చి చెప్పాడు. తాజా నిర్ణయం ఇండియాకు ఇబ్బందికరంగా మారనుంది. అమెరికా ఔషధాలకు భారతదేశం అతిపెద్ద విదేశీ మార్కెట్.
రాగి, రాగి ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. త్వరలో ఔషధాలపై అమెరికా ప్రకటన చేస్తుందని, కానీ అధికారులు తయారీదారులు తమ కార్యకలాపాలను దేశంలో తయారు చేయడానికి అవకాశం కూడా ఇస్తామన్నాడు ట్రంప్. దాదాపు ఒక సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం సమయం ఇస్తామన్నాడు. ఆ తర్వాతే సుంకం విధిస్తామన్నాడు.
అప్పుడు ఆ సుంకం 200 శాతం ఉంటుందన్నాడు. ఇటీవల రాగి, ఔషధాలు, కలప, సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాల దిగుమతులపై దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించాడు. ఈ నెలాఖరు నాటికి ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లపై అధ్యయనాలు పూర్తవుతాయని, ఆ తర్వాత ట్రంప్ విధానాలను ప్రకటిస్తారని అమెరికా వాణిజ్య మంత్రి చెప్పాడు.
భారతదేశం 2024-25లో ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల విలువైన రాగి, రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో అమెరికా మార్కెట్లకు ఎగుమతులే $360 మిలియన్లు, 17 శాతంగా ఉన్నాయి. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియాకు 26 శాతం, చైనాకు 18 శాతం ఇండియా ఎగుమతులున్నాయి. భారతదేశం రాగి ఎగుమతులకు అమెరికా మూడో అతిపెద్ద మార్కెట్.
రాగితో పోల్చితే భారతదేశానికి ఎక్కువగా నష్టం కలిగించేది ఔషధ రంగం. అమెరికా భారతదేశంలో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్, ఆర్థిక సంవత్సరం 25లో ఎగుమతులు $9.8 బిలియన్లకు పెరిగాయి. గతేడాది $8.1 బిలియన్ల నుండి 21 శాతం పెరిగాయి. ఇది భారతదేశం మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 40 శాతంగా ఉంది.
ఈ రంగంపై 200 శాతం లెవీ డిమాండ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో జనరిక్స్ పరిశ్రమ యునైటెడ్ స్టేట్స్‌లో సరసమైన మందులను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐతే అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో అన్ని రంగాల సుంకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందం ఖరారైతే, కొత్త సుంకాలు భారత మార్కెట్లను ప్రభావితం చేయకపోవచ్చు.
మరోవైపు బ్రిక్స్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. కూటమి సభ్యులపై 10 శాతం సుంకం విధిస్తానిని హెచ్చరించాడు. ఆ ఆట ఆడాలనుకుంటే అడొచ్చని, తాను కూడా ఆడగలనని బ్రిక్స్ దేశాలను హెచ్చరించాడు. బ్రిక్స్‌లో ఉన్న ఎవరైనా 10 శాతం టారిఫ్స్ తప్పవన్నాడు. తన దెబ్బకు కూటమిలో పలు దేశాలు ఎక్కువ కాలం సభ్యులుగా ఉండవన్నాడు. డాలర్ విషయం గురించి మాట్లాడితే తాను అసలు సహించనన్నాడు. డాలర్ లేకుంటే ప్రపంచం ఎంతో కోల్పోతుందన్నాడు.
ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం ఎప్పపటికీ కొనసాగుతుందన్నాడు. ఎవరైనా సవాలు చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సినన్నాడు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన BRICS ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియాలను కలుపుకుని బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో తన 17వ శిఖరాగ్ర సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించింది.
బ్రిక్ దేశాలు ఇప్పుడు ప్రపంచ జనాభాలో 45 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచ GDPలో 35 శాతం వాటా ఉంది. జూన్ 2022లో, బ్రిక్స్ దేశాల కరెన్సీల ఆధారంగా కొత్త అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీని సృష్టించాలని రష్యా ప్రతిపాదించింది. BRICS నివేదిక ప్రకారం, సభ్య దేశాలు మార్పిడి మాధ్యమంగా US డాలర్‌ను భర్తీ చేయడానికి ప్రయత్నించడం లేదని చెప్పాయి. శాశ్వతంగా మార్కెట్‌పై ప్రభావం చూపించేలా నిర్ణయాలు తీసుకోవాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ట్రంప్ బెదిరింపులకు ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ పడిపోవడమే.
ఈ సంవత్సరం అమెరికా డాలర్ మూడు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరో, యెన్ వంటి కరెన్సీలతో పోలిస్తే 10 శాతం పైగా క్షీణించింది. సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఊహించిన పరిణామాలు సంభవించాయి. డాలర్ విషయంలో ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అసలు డాలర్ ను ఇండియా లక్ష్యంగా చేసుకోలేదని, అక్టోబర్ 2024లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. అమెరికా విధానాలు తరచుగా కొన్ని దేశాలతో వాణిజ్యాన్ని క్లిష్టతరం చేశాయని ఆయన చెప్పారు.