తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్

తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టాన పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారా..? స్థానిక సమరానికి హస్తం శ్రేణులను సన్నద్ధం చేసే సక్సెస్ మంత్రం ఏంటి..? గ్రౌండ్‌లోని క్యాడర్ నుండి ఏఐసీసీ పూర్తి రిపోర్ట్ తీసుకోనుందా..? పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానం కోరుతుందా..? ఇంతకీ కాంగ్రెస్ అగ్రనేత హితబోధ ఎందుకోసం..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజల ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందట. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌పై హస్తం హైకమాండ్ ఫోకస్ పెట్టింది. గత పదేళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చి యేడాది పూర్తి చేసుకున్న వేళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ నడిబొడ్డున సుమారు 25 వేల మంది పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మండల, బ్లాక్, జిల్లా ప్రెసిడెంట్లు వివిధ పదవుల్లో కొనసాగుతున్న నేతలు సభకు హాజరు కానున్నారు.
నామినేట్ పదవులు చేపడుతున్న నేతలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర పార్టీ నేతలు, మంత్రులు, సీఎంతో సహా అందరూ సభకు రానున్నారు. వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడనున్నారు. కార్యక్రమంలో పార్టీ పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరుకావాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఉండే ఆయా ముఖ్య నేతలతో రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు సన్నాహక సమావేశాలు ఇప్పటికే పూర్తి చేశారు. కార్యకర్తలకు త్వరలో పదవులు వర్తిస్తాయని వారిలో మనోధైర్యం నూరిపోసి సభ సక్సెస్ చేయాలని తెలంగాణ హస్తం నేతలు భావిస్తున్నారు. ఖర్గే హాజరుకానున్న సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రచారం చేయనున్నారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని పార్టీ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు వరుస సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కీలక సమావేశాలు నిర్వహించారు. ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఖర్గే చాలా అంశాలపై దిశానిర్దేశం చేస్తారని.. వాటిని పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలోని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఇక చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుల సమావేశం గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ యాదవ్, చైర్మన్ ఫహీం ఖురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇంచార్జ్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, కె.ఎల్.ఆర్, బొంతు రామ్మోహన్, వేణు గౌడ్ పాల్గొన్నారు.
ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమావేశం చాలా కీలకమైన సమావేశమని అందుకు సన్నద్ధం కావాలని సన్నాహక సమావేశానికి వచ్చిన నేతలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడడం గతంలో ఎన్నడూ జరగలేదని ఇటువంటి సంప్రదాయానికి తెలంగాణ వేదిక అవుతుందని.. ఇతర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలువనుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది.
ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కాంగ్రెస్ మీటింగ్‌కి భారీగా హైప్ క్రియేట్ చేసేందుకు PCC చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి సీఎం, మంత్రుల వరకు తెగ కష్టపడుతున్నారు. ఖర్గే పర్యటన ఖరారు నుంచి ఇప్పటి వరకు పలుమార్లు సమావేశం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పార్టీ ముఖ్య నేతలకు వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశంతో పార్టీలో నూతనోత్తేజం చిగురిస్తుందని స్థానిక సంస్థల్లో రెట్టించిన ఉత్సాహం ఉప్పొంగుతుందనీ హస్తం నేతలు భావిస్తున్నారు. కష్టకాలంలో జెండా మేసిన కార్యకర్తలకు లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని కిందిస్థాయి నేతలు ఆశిస్తున్నారు.
మొత్తానికి తెలంగాణ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలుసుకుని.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు వేస్తోంది. మరి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలకు బోధించే గెలుపు మంత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.