తెలంగాణ

కాంగ్రెస్ ‘చలో రాజ్‌భవన్’.. రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన

అదానీపై జేపీసీ విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపు మేరకు టీపీసీసీ(TPCC) ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్‌’ చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ నేతలు దీనిలో పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్య పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం రాజ్‌భవన్‌ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్‌, మంత్రులు, నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై వినతిపత్రం అందించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంతో.. రాజ్ భవన్‌కు 100 మీటర్ల దూరంలోనే రేవంత్ రోడ్డుపై బైఠాయించి నిరనన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదానీ అంశంతో పాటు, మణిపూర్ అల్లర్లపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

‘ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికి నచ్చకపోవచ్చు. అదానీ, మోదీ దేశం పరువు తీస్తున్నారు. పార్లమెంట్‌లో నిలదీసినా స్పదన లేదు. ముందు అదానీ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలి. 75 ఏళ్ల పాటు కష్టపడి కాంగ్రెస్ దేశ ప్రతిష్టను పెంచింది. కానీ అదానీ, ప్రధాని ఇద్దరు కలిసి దేశం పరువు తీశారు. వ్యాపారం చేసేందుకు అదానీ అంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయి. అంశంపై మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు.


మా పోరాటం ఇక్కడితో ఆగదు. ప్రధాని మోడీ మౌనం వీడకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేస్తాం. జేపీసీ వేస్తే తప్పకుండా అదానీ జైలుకు వెళ్తారు. వేయకపోతే మోదీనే అదానీని కాపాడినట్లవుతుంది. అదానీతో మోదీ లాలూచీ ఒప్పందం చేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. అరెస్ట్ వార్తలు రాగానే హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఒప్పందం చేసుకున్నారు. నాణానికి ఒకవైపు మోదీ, మరోవైపు కేసీఆర్ ఉంటారు. అని రేవంత్ విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button