అంతర్జాతీయం

లాస్ ఏంజిల్స్‌లో వలస విధానాలపై ముట్టడులు

పశ్చిమాసియాలో రాజకీయ మంటలు రాజుకుంటున్నాయ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన వలస విధానాలపై ఆదేశించిన చర్యలు దేశవాప్తంగా నిరసనలకు దారి తీయగా, మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాలనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమవడంతో సంకీర్ణం తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.

ఇజ్రాయెల్ తక్షణ దాడికి సిద్ధమవుతోందన్న సంకేతాలు, అమెరికాను హై అలర్ట్‌లోకి నెట్టేశాయి. ఇరాన్ హెచ్చరికలు, ట్రంప్ గట్టి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో, పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్ అణు స్థావరాలపై ఏక్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అమెరికా అనుమానిస్తోంది. వెనుక నుంచి కథ నడిపిస్తున్నప్పటికీ మొత్తం వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.

మొత్తం పశ్చిమాసియా సంక్షోభం ఇటు అమెరికా-ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతోంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా చేస్తున్న యాగీ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యూదు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యాయంటూ ప్రపంచ శ్రేణి వర్శిటీలపైనే పగబెట్టుకున్న అమెరికా, ఇప్పుడు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతోంది.

పార్లమెంటును రద్దు చేయాలన్న ప్రతిపక్షాల ప్రయత్నం నుండి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు బయటపడ్డాడు. సంకీర్ణ సర్కారు కూలిపోతుందా అన్న పరిస్థితి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఇజ్రాయెల్ దూకుడుగా అరబ్ దేశాలపై దండయాత్ర చేస్తున్న సమయంలో వెనక్కి తగ్గితే అది తమకు నష్టం కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రజాప్రతినిధులు భావించడంతో ఆయనకు మరో లైఫ్ లైన్ లభించింది.

సైనిక చర్య విషయంలో తేడా వస్తే అది యూదు జాతి మొత్తానికి నష్టం కలిగిస్తోందని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో నెతన్యాహును కొనసాగించరానిది విపక్షాలు నిర్ణయించినప్పటికీ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయింది. దీంతో నెతన్యాహు సంకీర్ణం బయటపడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన తక్షణ ప్రమాదం కూటమికి తప్పింది.

120 సీట్ల నెస్సెట్‌లో 61 మంది శాసనసభ్యులలో బిల్లును తిరస్కరించగా, 53 మంది సమర్థించారు. సుదీర్ఘ చర్చల తర్వాత ముసాయిదా చట్టం ఆధారంగా, తాము ఇజ్రాయెల్‌ను ప్రపంచ అగ్రగామిగా మార్చుతామని విదేశాంగ వ్యవహారాలు, రక్షణ కమిటీ చైర్మన్ యులి ఎడెల్‌స్టెయిన్ తెలిపారు.

విద్యార్థులను సైన్యంలో పనిచేయమని బలవంతం చేయడం అనే వివాదాస్పద అంశంపై నెతన్యాహుపై కోపంగా ఉన్న అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీల సహాయంతో, ఎన్నికలను బలవంతం చేయాలని చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం బిల్లు ప్రవేశపెట్టింది. డిసెంబర్ 2022లో ఏర్పడిన నెతన్యాహు సంకీర్ణం, దేశ చరిత్రలో అత్యంత కాలం పనిచేసిన రైట్ వింగ్ కూటముల్లో ఒకటి.

ఓటింగ్‌కు ముందు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యుద్ధ సమయంలో ప్రభుత్వాన్ని కూల్చితే, అది యూదుల అస్తిత్వ ప్రమాదమన్నాడు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఎన్నికలలో గోదాలోకి లాగాలని చూసే ఎవరిని చరిత్ర క్షమించదని స్మోట్రిచ్ పార్లమెంటులో చెప్పారు. అరబ్ దేశాలతో పోరాడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నాడు. అవిశ్వాసం వీగిపోవడంతో తిరిగి మళ్లీ బిల్లు పెట్టాలంటే మరో ఆరు నెలల పాటు వేచి ఉండాల్సిందే.

మరోవైపు లాస్ ఏంజెల్స్‌లో వలసవాదులంటూ నెపం వేస్తూ బలగాలతో దెబ్బకొడుతున్నాడు ట్రంప్. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సాక్షాత్తూ అమెరికా పౌరులే ట్రంప్ తీరును ఖండిస్తున్నారు. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో ప్రస్తుతం ఇరాక్, సిరియాలో మోహరించిన వారి కంటే ఎక్కువ దళాలను మోహరించినట్టుగా తెలుస్తోంది.

కఠినమైన వలస విధానాలకు వ్యతిరేకంగా నిరసనలను అరికట్టడానికి, ఎక్కువ మంది అమెరికన్ దళాలను ట్రంప్ పంపించారు. దాదాపు 4,000 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది, 700 మందికి పైగా యాక్టివ్ డ్యూటీ మెరైన్‌లను మోహరించారు. ప్రస్తుతం ఇరాక్‌లో 2,500 మంది సైనికులు, సిరియాలో 1,500 మంది సైనికులే ఉన్నారని ABC న్యూస్ తెలిపింది.

మొత్తంగా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ఆరు నెలలకే అమెరికాను ట్రంప్ ఆగమాగం చేస్తున్నాడు. వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న వర్రీ ఇప్పుడు అమెరికా మేధావులను పట్టిపీడిస్తోంది. ప్రతి విషయాన్ని తెగేదాక లాగడం వల్ల అమెరికాకు నష్టం కలుగుతోందని ఎక్స్‌పర్ట్స్ వార్న్ చేస్తున్నారు.

మరోవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అమెరికా హై అలర్ట్‌లో ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలు విఫలమైతే అమెరికా అనుమతి లేకుండా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అమెరికా ఆందోళన చెందుతోంది. తాజాగా పశ్చిమాసియా నుండి ముఖ్యంగా బలగాలను వెనక్కి పిలిపించారు ట్రంప్.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేలా, అమెరికా ఒక డీల్ కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమైతే.. తమకు దాడి తప్ప మరో ఆప్షన్ లేదన్న భావనను ఇజ్రాయెల్ వ్యక్తం చేసింది. ఇరాన్ తీరుతో ట్రంప్ విసిగిపోయారని ఇక దాడి తప్పదన్న భావనను ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ దాడి జరిగితే అమెరికా అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తోంది.

ఇరాన్ దాడులకు గురైతే, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను టచ్ చేసి ప్రతీకారం తీర్చుకుంటుందని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే వార్నింగ్ ఇచ్చాడు. ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో స్థావరాలతో, ప్రధాన చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో అమెరికా బలగాలున్నాయి. ఒకవేళ ఇరాన్ దాడులు చేస్తే ఈ దేశాల్లో తమకు ఇబ్బంది తప్పదన్న ఆందోళనలో అమెరికా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button