News

బత్తాయి రైతులకు కష్టాలు

రైతుకు పంట పండినా కష్టమే, వానలు వచ్చినా కష్టమే, సాగు లేకపోయినా కష్టమే ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. పంట ఎక్కువ పండితే ధరలపై దెబ్బ. తక్కువ వర్షాలు వస్తే పంట పండని పరిస్థితి. అతివృష్టి వరదలతో రైతన్నపై దాడి చేసి కోలుకోకుండా దెబ్బకొడుతుంది. అయితే మరి రైతు రాజు అయ్యేదెప్పుడు. అసలు సిసలు లాభాలు చవిచూసేదెప్పుడు. అసలు రైతుకు సరైన లాభం ఎప్పుడొస్తుంది. అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి. ఇప్పుడు చూద్దాం.

బత్తాయి అనగానే గుర్తొచ్చేది తియ్యని నిమ్మ. కానీ ఆ తియ్యదనం ఈసారి చేదుగా మారిన పరిస్థితి ఏర్పడింది. పంట సాగు చేసిన రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గతేడాది టన్ను లక్ష రూపాయల వరకు పలకగా, ఈ ఏడాది కొనుగోళ్లే కరువయ్యాయి. మరోవైపు కాయకు తెగుళ్లు వచ్చి దిగుబడి లేక రైతన్నకు చేదు అనుభవం ఎదురవుతుంది. సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేక సతమతమవుతున్నారు. దీంతో బత్తాయి సాగు చేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన కనిగిరి, దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కొండపి ప్రాంతాల్లో బత్తాయి తోటలు సాగుచేస్తారు. సుమారు 15 వేల హెక్టార్లలో సాగయ్యే ఈ బత్తాయిని రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, కోల్‌కత్తా, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో అక్కడ వ్యాపారులు కాయలు కొనుగోలు చేయడంలేదు. మొదట్లో టన్ను 50 వేల ధర పలకగా ఇప్పుడు ఒక్కసారిగా 20 వేలకు పడిపోయింది.

దీంతో సాగు చేసిన రైతులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సీజన్ మొదట్లో టన్ను 40 నుంచి 50 వేలకు విక్రయించారు. మే, జూన్‌లో ఈ ధర లక్ష వరకు పలుకుతుందని ఆశించారు. కానీ అనుకున్నది జరగకపోగా మొత్తం మలుపు తిరిగింది. ధరలు అమాంతం పడిపోయి, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైట్ బత్తాయి రైతు, ముండ్లమూరు.

అయితే రైతులకు మార్కెట్ ధర, వ్యాపారులు సహకారం కంటే ముందు వరుణుడు సహకరించాలి. కానీ అటు వాన లేక ఇటు ఎండ లేక ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో కాయకు తెగుళ్లు వచ్చి అర్థాంతరంగా రైతన్న శ్రమ వృధా అవుతుంది. కాయలకు మంగుమచ్చ ఏర్పడి తీవ్రనష్టానికి దారితీస్తుంది.

మచ్చ రావడంతో టన్నుకు 10 వేలకు పైగా ధర పెట్టడంలేదు. తెగుళ్లు అరికట్టడానికి రసాయనాలు అధికంగా వాడటంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత భారంగా మారింది. అయితే ప్రతిఏటా వేసవిలో వచ్చే కాయకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

దిగుబడి తక్కువ వచ్చినా కాయల్లో రసం అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పోటీపడి కొంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన కాపు చిత్తకాపుగా రైతులు చెప్తున్నారు. దిగుబడి తగ్గడంతోపాటు కాయల్లో రసం కూడా తక్కువ అయిపోయింది. అంతేకాకుండా టన్నుకు రెండు క్వింటాళ్ల వరకు తరుగు తీస్తున్నారు. ఉండేకొద్దీ ధరలు ఇంకా తగ్గుతాయనే భయంతో తప్పని పరిస్థితుల్లో వచ్చినంత వరకు తీసుకుంటున్నారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా 40 వేలు వచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు.
బైట్ బత్తాయి రైతు, ముండ్లమూరు.

గత ప్రభుత్వ పాలనలో బత్తాయి రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. రాయితీలు కల్పించడంతో పాటు వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. కనిగిరిలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రైతులకు హామీలు కూడా ఇచ్చింది. అయితే వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా బత్తాయి రైతుల పట్ల స్పందించి గిట్టుబాటు ధర కల్పించి దాంతోపాటు రాయితీ పరికరాలు అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button