నకిలీ మద్యం కేసులో సంచలన పరిణామాలు

కల్తీ మద్యం కూటమి ప్రభుత్వానికి చిక్కులు తీసుకొస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లని తీసివేసి నాణ్యమైన మద్యానికి నాంది పలికింది. అంతే కాకుండా గత ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు, అలాగే డిస్టలిరీస్, నకిలీ హాలోగ్రామ్స్ వంటివి గుర్తించి మద్యం కేసులు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తులని సిట్ అధికారులు అరెస్ట్ లు చేయటం , అలాగే జుడీషియల్ రిమాండ్ కి తరలించారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతుంటే మరో వైపు తాజాగా నకిలీ మద్యం కలకలం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని సమాచారం.
మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నప్పడికి తులసి వనంలో గంజాయి మొక్కలా నకిలీ మద్యం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ రాజేస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి మద్యం ఒక ఆర్థిక వనరే కాకుండా మందు బాబుల ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ గా రాజకీయ పార్టీలు భావిస్తాయి. మరోవైపు కీలక నిందితుడు జనార్థన్ రావు ఆరోపణలను మాజీమంత్రి జోగి రమేష్ ఖండించారు. దేనికైనా సిద్ధమేనంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు. దీంతో తదుపరి చర్యలు ఏంటి అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన నకిలీ మద్యం కేసులో సంచలన పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు వీడియోపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని సీఎం చంద్రబాబుకి సవాల్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని. తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
అయితే జోగి రమేష్‌పై నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్థన్ రావు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు వీడియో ఒకటి ప్రస్తుతం రాజకీయ వర్గాలను కుదిపేసింది. జనార్దన్‌రావు ఓ వీడియోలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ పేరును తీసుకురావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మాజీ మంత్రి స్పందించి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రాజధాని ప్రాంతానికి ద్వారం లాంటిది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కొలువై ఉండే విజయవాడకు కూతవేటు దూరం . అలాంటి ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ కొనసాగుతుంటే అధికారులకు కనిపించలేదా అనే సందేహాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. నకిలీ మద్యం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో మద్యం సిండికేట్లు, రాజకీయ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య సంబంధాన్ని బయటపెడుతుంది.ఎక్కడో అటవీ ప్రాంతాల్లోని నాటు సారాతయారీ స్థావరాలను డ్రోన్లతో గుర్తించి దాడులు చేసే అధికారగణానికి జనారణ్యంలో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నా కనిపించలేదంటే రాజకీయ నాయకుల అండదండలు అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు.
నకిలీ మద్యం తయారీ అవుతుందంటే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండల్లేకుండా అసాధ్యమన్నది బహిరంగ రహస్యమే అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారట. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అబ్కారీశాఖ అధికారులు తాపీగా చెప్తున్నారంటే దీని వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం గత ప్రభుత్వ హయాం నుంచే నడుస్తోందంటే సామాన్య విషయం కాదని ప్రభుత్వాలు మారిన నకిలీ మద్యం మాఫియా ఆగడాలు ఆగవని అందరు అనుకుంటున్నారట.
నకిలీ మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అగ్రహావేశాలకి గురిచేస్తుంది. నకిలీ మద్యం తయారీ వెనుక వైసీపీకి చెందిన నాయకులు టీడీపీలోకి ఏవిధంగా వచ్చారనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న వారిపై టీడీపీ అధిష్టానం కన్నెర్ర చేసారనే విషయం అంతర్గత చర్చలకి దారి తీస్తుందని సమాచారం. ఒక పక్క కూటమి ప్రభుత్వం సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే మరొకవైపు నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేయటం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా నకిలీ మద్యంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి బార్లు, మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులకు నకిలీ మద్యం తరలిపోతుంటే ఎందుకు గుర్తించలేకపోయారనే ఆలోచన ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో అంటకాగిన ఓ అధికారిని మద్యం సిండికేట్ నిర్వాహకులు ఎన్టీఆర్ జిల్లాకు ఏరికోరి తెచ్చుకున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ఆ అధికారి ఓ కీలక మంత్రికి సన్నిహితుడు అని చర్చలు నడుస్తున్నాయి.
అందరి సహకారంతోనే నకిలీ మద్యం రాకెట్ రాష్ట్రంలో తమ హవా కొనసాగిస్తున్నారనే విస్తుపోయే నిజాలు బయటకి వస్తున్నాయంట. నకిలీ మద్యాన్ని నడిపిస్తున్న ముఠాపై సీఎం చంద్రబాబు సీరియస్ అవ్వడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. సీఎం చంద్రబాబు, నిఘా వ్యవస్థ నుంచి నకిలీ మద్యంపై నివేదిక తెప్పించుకున్నారని సమాచారం.అధికారుల పాత్ర, రాజకీయ నాయుకుల పాత్రపై సీఎం చంద్రబాబు ఆరా తీయటంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో మరింత హీట్ పుట్టిస్తుందంట.
ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి చూసీచూడనట్లు ఉండటానికి నెలకు లక్షల రూపాయాల్లో అధికారులకు ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఈ నకిలీ కేంద్రానికి వెన్నుదన్నుగా ఉన్నారని, ఆయనే అనుకూలమైన అధికారిణిని అక్కడ నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీగ లాగితే డొంకంత కదిలేలా ఈ నకిలీ మద్యం విషయంలో ఎవరు పాత్ర దారులు? ఎవరు సూత్ర దారులు? అనే వివరాలు తమ ముందుండాలని ఉన్నతాధికారులకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారట. నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ నకిలీ మద్యంపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటూ అరెస్టులు కూడా చేస్తోంది.వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆమాత్యులకి దిశా నిర్దేశం చేస్తున్నారట. నకిలీ మద్యంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారంట.నకిలీ మద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా మంత్రులు పని చేయాలనీ సీఎం సూచించారంట.
నకిలీ మద్యంని గుర్తించటానికి త్వరలో ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారట. ఈ యాప్ తో హోలోగ్రామ్ ని పరీక్షిస్తే మద్యం నాణ్యమైనదో లేకపోతే కల్తీ అనేది తెలుస్తుందంట. దీనితో ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఫై నమ్మకం పెరుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట.



